`జాతి వ్యతిరేకులు’పై మాట్లాడినందుకు రూ 40 కోట్ల నష్టం

ఫైర్ బ్రాండ్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడుతుంటారు. తన మనసులో మాటలను స్వేచ్ఛగా చెప్పే కంగనా  చాలా సార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు. బాలీవుడ్ నెపోటిజం, జాతి వ్యతిరేకులు, రాజకీయాలు ఇలా ఒక్కటేంటి ఆమె తన వ్యాఖ్యలతో ఎప్పుడూ సంచలనాలు రేపుతుంది.
 
తాజాగా ఈ విషయంపై స్పందించిన కంగనా జాతి వ్యతిరేకులు/ రాజకీయ నాయకులు తదితర విషయాలకు వ్యతిరేకంగా తాను స్పందించిన కారణంగా ఏడాదికి రూ.30 నుంచి 40 కోట్లు కోల్పోయానని స్పష్టం చేసింది. పలు బ్రాండ్లలో నటించే అవకాశం రానీయకుండా చేశారని తెలిపింది. ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ వ్యాఖ్యానించిన `నాకు కావాల్సింది నేను చెబుతాను’ అనే మాటను స్క్రీన్ షాట్ రూపంలో షేర్ చేసింది.

“ఇది హిందుత్వం కోసం మాట్లాడే నిజమైన స్వేచ్ఛ, విజయం. రాజకీయ నాయుకులు/ జాతి వ్యతిరేకులు/తుగ్డే గ్యాంగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు 20 నుంచి 25 వాణిజ్య ప్రకటనలను రాత్రికి రాత్రే కోల్పోయాను. ఫలితంగా నాకు సంవత్సరానికి రూ. 30 నుంచి రూ. 40 కోట్ల నష్టం వచ్చింది.” అని కంగనా స్పష్టం చేసింది.

అయితే ఎంత నష్టం వచ్చినా తను మాట్లాడాలనుకున్నది ఎవ్వరూ ఆపలేరని కంగనా తెలిపింది. “కానీ నేను స్వేచ్ఛగా ఉన్నాను. దేశ సంస్కృతి, సమగ్రతను ద్వేషించే ఏజెండాతో నడిచే కంపెనీలు, వారి కార్పోరెడ్ హెడ్‌లు నేను మాట్లాడాలనుకునేది ఆపలేరు” అని ఆమె తెలిపారు.

“ప్రతి ఒక్కరూ బలహీనతలను మాత్రమే ప్రదర్శిస్తారు. కాబట్టి నేను ఎలోన్ మస్క్‌ను అభినందిస్తున్నాను. కనీసం ధనవంతుడు డబ్బు గురించి పట్టించుకోకూడదని అనుకుంటున్నాను.” అని కంగనా స్పష్టం చేసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ పీ వాసు దర్శకత్వంలో చంద్రముఖీ2లో నటించనుంది. అంతేకాకుండా మణికర్ణిక 2 కూడా చేసేందుకు ఆసక్తిగా ఉంది.

ఇది కాకుండా ఎమర్జెన్సీ అనే చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన విషయాలను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు ఆమె స్వీయ దర్శకత్వం వహిస్తోంది.