సీఎం ఎంపికలో ఎందుకీ జాప్యం?

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించినప్పుటికీ ముఖ్యమంత్రి ఎంపికలో చేస్తున్న జాప్యాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై నిలదీశారు. ఆ పార్టీలో ఐక్యత లోపించడం వల్లే సీఎం ఎంపికలో జాప్యం జరుగుతోందని బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు.
 
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాని ప్రజాసేవకు నడుం బిగించాలని ఆయన హితవు చెప్పారు.  కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారని గుర్తుచేస్తూ రాష్ట్రాభివృద్ధికి వెంటనే పని ప్రారంభించాలని మాజీ సీఎం పేర్కొన్నారు. పూర్తి మెజారిటీ సాధించినా ఆ పార్టీలో ఐక్యత లోపించడం వల్లనే సీఎం ఎన్నికలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.
 
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం మాని, కొత్త సీఎంను ఎన్నుకుని, ప్రజలకు సేవ చేసేందుకు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. సీఎం ఎంపిక ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనందున ఇంతకంటే తాను ఎక్కువ మాట్లడలేనని తెలిపారు.
 
రాష్ట్రంలోని లింగాయత్ సామాజిక వర్గం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, లింగాయత్‌ల గురించి కాంగ్రెస్ మాటల్లో చాలా చెప్పిందని పేర్కొంటూ సీఎం, డిప్యూటీ సీఎంతో సహా ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఎన్ని పదవులు ఇస్తుందో తాము వేచిచూడాలని అనుకుంటున్నామని చెప్పారు.