మే 20న సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రిగా  సిద్ధరామయ్య మే 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు   సీఎంగా సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్యతో పాటు శివకుమార్ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన విస్తృతస్థాయి మంతనాల అనంతరం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. పదవుల పంపకానికి డీకే శివకుమార్‌ ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

గురువారం సాయంత్రం 7 గంటలకు బెంగుళూరులో జరుగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారు. నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి ఎంపికపై ఢిల్లీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలకు చివరకు ఈ రోజుతో తెరదింపే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ డీకే శికుమార్ ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేఖ రాసారు. ఈ సమావేశంలో అధికారికంగా కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

సిద్దరామయ్య వద్ద డిప్యూటీగా పని చేసేందుకు శివకుమార్ సిద్దంగా లేరు. ఇస్తే తనకు సీఎం పదవి ఇవ్వాలి, లేకుంటే ఎమ్మెల్యేగానే కొనసాగుతానని డీకే ఇప్పటికే స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే ఉపముఖ్యమంత్రిగా ఉండేందుకు డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
 
అంతకు ముందు సీఎం పదవి కోసం పట్టుబట్టిన శివకుమార్ సోనియాతో మాట్లాడాక వైఖరి మార్చుకున్నట్టు సమాచారం. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య చేపట్టేందుకు లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. సీఎం పీఠం కోసం సిద్ధరామయ్యతో పోటీపడిన డీకే శివకుమార్ ను బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పలు హామీలు ఇచ్చింది. మొదటి రెండున్నరేళ్లు కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, ఆ తర్వాత రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది.

కర్ణాటక పీసీసీ చీఫ్ గా కొనసాగే అవకాశం కూడా ఇచ్చింది. అంతేకాదు, డీకే శివకుమార్ సూచించిన ఆరుగురికి కీలకమైన మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

1980ల్లో జనతా పరివార్‌ పార్టీతో సిద్ధరామయ్య తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జేడీఎస్ నుంచి 2006లో కాంగ్రెస్‍కు వచ్చారు. దేవరాజ్ ఉర్స్ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పూర్తి పదవీ కాలం (2013-18) కొనసాగిన రెండో వ్యక్తిగా సిద్ధరామయ్య నిలిచారు. ఇప్పుడు మరోసారి సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు రెడీ అయ్యారు.

224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది.  బీజేపీ 66 సీట్లతో రెండో స్థానంలో నిలవగా, కింగ్‌మేకర్‌గా బరిలోకి దిగాలని భావించిన జేడీఎస్ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకుంది.