లంచం తీసుకోవడం కూడా మనీలాండరింగ్‌

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికార పరిధిని విస్తరించేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేర ప్రక్రియ, ఆ నేరం వల్ల వచ్చిన ఆదాయం సయామీ కవలల లాంటివని పేర్కొంది. అవినీతి కేసులో లంచం తీసుకోవడం కూడా మనీలాండరింగ్‌ కిందకే వస్తుందని స్పష్టం చేసింది.  అవినీతి లేదా హత్య వంటి షెడ్యూల్డ్‌ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఈడీకి దర్యాప్తు ప్రారంభించే అధికారం ఉంటుందని తేల్చిచెప్పింది. ‘‘కొన్ని నేరాలు షెడ్యూల్డ్‌ నేరాలే అయినప్పటికీ వాటి వల్ల ఆదాయం రావచ్చు, రాకపోవచ్చు” అని తెలిపింది.

ఉదాహరణకు సెక్షన్‌ 302 ప్రకారం హత్య అనేది శిక్షార్హమైన షెడ్యూల్డ్‌ నేరం. అది లబ్ధి కోసం లేదా కిరాయి హంతకుడు చేసినా.. ఆ నేరం వల్ల ఆదాయం వచ్చినట్లు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇలాంటి కేసుల్లో కేవలం నేరం చేసినంత మాత్రాన సరిపోదని, దానివల్ల వచ్చిన రాబడినీ చూపాల్సిందేనని ఎవరైనా వాదించవచ్చని వివరించింది.

 కానీ, అవినీతి కేసులో మాత్రం నేరం, నేరం వల్ల వచ్చిన రాబడి అనేవి సయామీ కవలల్లాంటివి. కాబట్టి ఒక షెడ్యూల్డ్‌ నేరం చేయడం వల్ల కనిపించని ఆస్తులు సమకూరినా.. సెక్షన్‌ 2(1)(యూ) ప్రకారం వాటిని నేరం కారణంగా వచ్చిన ఆస్తులుగానే పరిగణించాల్సి ఉంటుంది. అవినీతి ఆరోపణలు వచ్చి, వసూళ్లకు పాల్పడి ఉంటే.. మనీలాండరింగ్‌ కిందకే వస్తుందని జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం పేర్కొంది.

తమిళనాడులో ఉద్యోగాలకు లంచం కుంభకోణంపై తాజాగా దర్యాప్తు చేయాలంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.

తమిళనాడు రవాణా సంస్థలో ఉద్యోగాల భర్తీ సందర్భంగా 2011–15 మధ్య నాటి డీఎంకే ఎమ్మెల్యే, మంత్రి వి.సెంథిల్‌ బాలాజీ అభ్యర్థుల నుంచి లంచం తీసుకున్న కేసులో మద్రాస్‌ హైకోర్టు ఆ తీర్పు ఇచ్చింది. అలాగే ఈ కుంభకోణంలో ఈడీ మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనూ పక్కన పెట్టింది.

మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించాలంటే నిందితులుగా పేర్కొన్న వారి వద్ద అక్రమ సంపాదనను గుర్తించాలని, అలా గుర్తిస్తేనే దర్యాప్తు చేయాలని నిందితుల తరఫు న్యాయవాది సీఏ సుందరం వాదించారు. మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా ఇదే వాదన వినిపించారు.

ఇక కపిల్‌ సిబాల్‌ అయితే మరో అడుగు ముందుకేశారు. నేరం ద్వారా వచ్చే ఆదాయం, మనీలాండరింగ్‌ మధ్య వ్యత్యాసాన్ని తొలగించే వివరణ రాజ్యాంగపరంగా అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఏదైనా కళంకిత సంపద సాధారణ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడే మనీలాండరింగ్‌ ఆరోపణలు మోపాలని చెప్పారు.

అయితే ఈ వాదనను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తోసిపుచ్చారు. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా అది ఈడీ దర్యాప్తు పరిధిలోకి వస్తుందని చెప్పారు. ధర్మాసనం కూడా ఈ వాదనతో ఏకీభవించింది. ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడితే ఆ సొమ్ము అతని దగ్గరే ఉంటుందని అందరికీ తెలుసని, అదేమీ రాకెట్‌ సైన్స్‌ కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవినీతి కేసులో ఈడీ మనీలాండరింగ్‌ దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది.