ఖరీఫ్‌లో ఎరువుల సబ్సిడీకి కేంద్రం రూ 1.08 లక్షల కోట్లు

ఖరీఫ్‌లో ఎరువుల సబ్సిడీకి కేంద్రం రూ 1.08 లక్షల కోట్లు ఖర్చుపెడుతుంది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఎరువుల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది.

2023- 24 ఖరీఫ్ పంటకాలానికి కూడా ఇప్పుడున్న ధరలకే రైతులకు ఎరువులు అందేలా చేసేందుకు సబ్సిడీని కల్పించేందుకు అయ్యే వ్యయం వివరాలను మంత్రి విలేకరులకు అందించారు. ఎప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ ఖరీఫ్ సీజను ఉంటుంది. రైతులకు నాణ్యమైన ఎరువులను సబ్సీడీ ధరలకే అందజేసే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రైతులకు తక్కువ ధరకు పోషక విలువలతో కూడిన ఎరువులను అందించే లక్ష్యంతో ఈ సబ్సీడీ పథకాన్ని 2010లో ప్రారంభించారు. తాజాగా, ఆ ఎరువుల సబ్సీడీ రేట్లను సవరించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ లో అందుబాటు ధరలో, సరైన సమయానికి నాణ్యమైన డీఏపీ, ఇతర పాస్ఫరస్, పొటాషియం (పి అండ్ కె) ఎరువులు లభిస్తాయి.

ఈ పంటకాలంలో ఫాస్పేట్ పొటాసియం ఎరువులకు రూ 38,000 కోట్ల సబ్సిడీ అందుతుంది.  యూరియాకు రూ 70,000 కోట్ల సబ్సిడీ కలిపితే మొత్తం మీద సబ్సిడీ విలువ రూ లక్ష కోట్లు దాటుతోంది. ఎరువుల గరిష్ట ధరలలో ఎటువంటి మార్పులు ఉండబోవని మంత్రి తెలిపారు.

ఇప్పుడు దేశంలో యూరియా బస్తా ధర రూ 276గా ఉంది. కాగా డిఎపి ఎరువు బ్యాగ్ ధర రూ 1,350గా ఉంది. సబ్సిడీతో దేశ వ్యాప్తంగా దాదాపుగా 12 కోట్ల మంది రైతులకు మేలు జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.