రాష్ట్రమంతా ధర్మ రక్షణ పరిషత్ ద్వారా ధర్మ ప్రచారం

ధర్మ రక్షణ పరిషత్‌ ఏర్పాటు చేసి రాష్ట్ర మంతా ధర్మ ప్రచారం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. యజ్ఞం ముగింపు సందర్భంగా నిర్వహించిన మహాపూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరయ్యారు.
 
 విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి, అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి తదితరులు సీఎం జగన్‌తో పూర్ణాహుతి చేయించారు. తదుపరి శ్రీలక్ష్మీ దేవి స్వర్ణ ప్రతిమకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమం మొత్తం స్వరూపనందేంద్ర సరస్వతి కనుసన్నల్లోనే జరిగింది.
 
ఈ సరదర్భంగా వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అక్కడే మంత్రులు, అధికారులతో మాట్లాడారు. అలాగే దుర్గగుడి అభివృద్ధిపైనా చర్చించారు. ఈ అంశాలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు తెలిపారు. యాగం విజయవంతం అవడంపై సిఎం సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
 
రూ.225 కోట్ల వ్యయంతో ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్‌ప్లాను సిఎం పరిశీలించి పలు సూచనలు చేశారని మంత్రి పేర్కొన్నారు. గుడిలోకి తూర్పువైపు నుండి వెళ్లి తూర్పువైపుగానే వచ్చేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
 
తిరుమల తిరుపతి తరహాలో మంచినీటి వసతి, టాయిలెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని వివరించారు. ఆగ్నేయంలో మూడు అంతస్తుల్లో ప్రసాదపోటు పెడుతున్నామని చెప్పారు. ఈ నెల 25 నుంచి 31 వరకూ శ్రీశైలంలోని శివాజి రాజగోపురంపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా బంగారు కలశం ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.