అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి తొలగిన అడ్డంకులు

అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్‌-5 జోన్‌లో సెంటు ఇళ్ల స్థలాలు కేటాయించవచ్చని, రాష్ట్ర ప్రభుత్వానికి స్థలాలు ఇచ్చే హక్కు ఉందని సుప్రీం వెల్లడించింది. అమరావతి ఆర్- 5 జోన్ పై రాజధాని వాసులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా  సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
 
ఈ పిటిషన్లపై జస్టిస్ కె.ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా వాదనలు తర్వాత ధర్మాసనం అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. చట్టం ప్రకారం ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించింది. అయితే తుది తీర్పు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో అమరావతి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించి ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి సెంటు స్థలాలు పంపిణీ చేస్తున్నారని అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్లపై విచారణలో పేదలకు పట్టాలు పంపిణీ చేసేశామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సీఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం పెట్టుబడులతో వచ్చే ఐటీ కంపెనీల కోసం కేటాయించిన ప్రాంతాన్ని విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్-5 పేరిట ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది.

ఈ మేరకు ప్రభుత్వం సీఆర్డీఏ చట్టానికి సవరణ కూడా చేసింది. అమరావతి ప్రాంతంలో మందడం, ఐనవోలు, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలోని 1134 ఎకరాలను నివాస ప్రాంతంగా మార్చి ఆర్-5 జోన్‌గా ఇటీవల గెజిట్ విడుదల చేసింది.

ఆర్-5 జోన్ పై అమరావతి రైతులు అభ్యంతరం తెలుపుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తుది తీర్పు ప్రకారం ఇళ్ల స్థలాల కేటాయింపు ఉండాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ఆర్-5 జోన్ లో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మొదలుపెట్టింది.

రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో 107 జీవో జారీ చేసింది. విజయవాడ, గుంటూరు ప్రాంతంలోని పేదలందరికీ ఇళ్లు కేటాయించేందుకు నిర్ణయించింది. అయితే ఈ జీవోను గతంలో హైకోర్టు సస్పెండ్ చేసింది. జోనల్ రెగ్యులేషన్‌కు ఈ జీవో విరుద్ధమని, జోనల్‌ పరిధిని కుదించడమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆర్ -5 జోన్ తీసుకువచ్చింది. రాజకీయ అజెండాలో భాగంగా రాజధాని ప్రాంతానికి చెందనివారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని సవరణ చేసిందని రైతులు వాదిస్తున్నారు.