సీడీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ రాజా సుబ్రమణి

సీడీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ రాజా సుబ్రమణి
పాకిస్తాన్, చైనా సైనికుల వ్యవహారాలపై నిపుణుడిగా పేరొందిన భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్​)గా జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30న ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి నియమితులయ్యారు.  ప్రతిష్టాత్మక సైనిక థియేటరైజేషన్ ప్రణాళికను అమలు చేయడం, త్రివిధ దళాల సమన్వయాన్ని బలోపేతం చేయడం ప్రాథమిక విధిగా జనరల్ సుబ్రమణి బాధ్యతలు స్వీకరించారు. 
 
బాధ్యతల స్వీకరణ సందర్భంగా డిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో జనరల్ రాజా సుబ్రమణికి త్రివిద దళాలు గౌరవ వందనాన్ని సమర్పించాయి.  రాజా సుబ్రమణి సీడీఎస్ పదవితో పాటు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్’ సెక్రటరీగా కూడా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఆయన ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి సచివాలయంలో సైనిక సలహాదారుగా పనిచేస్తున్నారు. 
 
ఆయన గత ఏడాది జూలై 31న ఆర్మీ వైస్ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే, ఈ సైనిక అధికారి మాట్లాడుతూ, సాయుధ దళాల పరివర్తన, త్రివిధ దళాల సమన్వయం, ఏకీకరణను పెంపొందించే సంస్థాగత సంస్కరణలు తన ప్రాథమిక దృష్టిగా ఉంటాయని తెలిపారు. “మన సాయుధ దళాలలో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, ప్రవేశం, ఏకీకరణను మేము వేగవంతం చేస్తాము,” అని ఆయన ఒక సంక్షిప్త మీడియా ప్రకటనలో తెలిపారు.
 
 “మన జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో మన సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, కార్యాచరణ నిర్ణయాత్మకతను ప్రదర్శించాయి. మన దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి మనం కట్టుబడి ఉన్నాము,” అని ఆయన పెక్రోన్నారు. “సాయుధ దళాలు అంకితభావం, ధైర్యం, గౌరవం, వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేస్తూనే ఉంటాయని నేను భారత పౌరులకు హామీ ఇస్తున్నాను,” అని ఆయన ప్రకటించారు. 
 
సాయుధ దళాలలో స్వదేశీ ఆయుధ వ్యవస్థల అభివృద్ధి, ప్రవేశం,  ఏకీకరణను వేగవంతం చేయడానికి కూడా తాను కృషి చేస్తానని జనరల్ సుబ్రమణి పేర్కొన్నారు. రక్షణ దళాల అధిపతిగా, సమీకృత సైనిక కమాండ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా థియేటరైజేషన్ నమూనాను అమలు చేయడం జనరల్ సుబ్రమణి ప్రాథమిక కర్తవ్యం. 
 
40 సంవత్సరాలకు పైగా సాగిన తన విశిష్టమైన వృత్తి జీవితంలో, జనరల్ సుబ్రమణి అనేక రకాల సంఘర్షణలు, భూభాగ పరిస్థితులలో పనిచేశారు పలు కమాండ్, స్టాఫ్ మరియు బోధనా పదవులను నిర్వహించారు. ఆయన జూలై 1, 2024 నుండి జూలై 31, 2025 వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా, మార్చి 2023 నుండి జూన్ 2024 వరకు సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. 
 
ఈ అధికారి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీలో పట్టభద్రులు. ఆయన డిసెంబర్ 14, 1985న గర్హ్వాల్ రైఫిల్స్ ఎనిమిదవ బెటాలియన్‌లో నియమితులయ్యారు. జనరల్ సుబ్రమణి బ్రాక్‌నెల్ (యూకే)లోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి. ఆయన లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి డిఫెన్స్ స్టడీస్‌లో ఎం.ఫిల్ పట్టాను పొందారు. 
 
ఆయన ఆపరేషన్ రైనోలో భాగంగా అస్సాంలో తిరుగుబాటు నిరోధక చర్యలలో 16 గర్హ్వాల్ రైఫిల్స్‌కు, జమ్మూ కాశ్మీర్‌లో 168 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌కు, క్లిష్టమైన కార్యాచరణ వాతావరణంలో సెంట్రల్ సెక్టార్‌లో 17 మౌంటెన్ డివిజన్‌కు నాయకత్వం వహించారు. అంతేకాకుండా, వెస్ట్రన్ ఫ్రంట్‌లో భారత సైన్యంలోని ఒక ప్రముఖ స్ట్రైక్ కార్ప్స్‌తో సహా రెండు కార్ప్స్‌కు నాయకత్వం వహించి ఆయన విశేష ఖ్యాతిని పొందారు. 
 
జనరల్ సుబ్రమణి  స్టాఫ్, బోధనా నియామకాలలో మౌంటెన్ బ్రిగేడ్ బ్రిగేడ్ మేజర్‌గా, కజకిస్తాన్‌లో డిఫెన్స్ అటాచ్‌గా, మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మిలిటరీ సెక్రటరీగా, జమ్మూ కాశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్ డిప్యూటీ కమాండర్‌గా, రక్షణ మంత్రిత్వ శాఖ (ఆర్మీ)  ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్‌లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌గా పదవులు ఉన్నాయి. 
 
ఆయన ఈస్టర్న్ కమాండ్‌లో బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ (ఆపరేషన్స్), వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ (ఆర్మీ),  నార్తర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవులను కూడా నిర్వహించారు. ఆయన చేసిన విశిష్ట సేవకు గాను పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం, సేనా పతకంలను ప్రదానం చేశారు.