అవినాష్ గైరాజర్ తో రోజంతా వెంటాడిన సీబీఐ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్‌రెడ్డి శుక్రవారం కూడా సిబిఐ విచారణకు హాజరు హాజరు కాకపోవడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విచారణకు హాజరయ్యేందుకు వేకువజామునే ఆయన పులివెందుల నుంచి హైదరాబాద్‌  వచ్చి, సిబిఐ కార్యలయం వైపు బయలుదేరి, అకస్మాత్తుగా పులివెందులవైపు తిరిగారు.

 అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఇంట్లో  కళ్లు తిగిరి పడిపోవడంతో  ఆమెను పులివెందులలోని ఇసి గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్పించని తెలిసి, అక్కడకు వెడుతున్నట్టు అవినాష్‌ రెడ్డి సిబిఐ అధికారులకు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని, తన తండ్రి జైల్లో ఉన్నారని, తన తల్లిని తానే చూసుకోవాల్సి ఉందని అందులో పేర్కొన్నారు.

ఈ మేరకు అవినాష్‌ రెడ్డి తరుఫు న్యాయవాది మల్లారెడ్డి లిఖిత పూర్వకంగా సిబిఐ అధికారులకు సమాచారమిచ్చారు. సిబిఐ అధికారులు సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందించకపోవడంతో రెండు వాహనాలలో అవినాష్ ను వెంటాడుతూ బయలుదేరారు.

ఇంతలో శ్రీలక్మికి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఆయనకు తన తల్లిని తీసుకొస్తున్న అంబులెన్స్‌ ఎదురైంది. వాహనం దిగివెళ్లి తల్లిని చూసిన అవినాష్‌ రెడ్డి  అంబులెన్స్‌ వెంట తిరిగి హైదరాబాద్‌ బయల్దేరారు.

శ్రీలక్మి ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందిగా మారడంతో ఆమెను దారిలో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. అక్కడే అవినాష్‌ రెడ్డి కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. మరోవంక, ఎంపి అవినాష్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి పులివెందులకు వస్తున్న సమయంలో కవర్‌ చేస్తున్న మీడియా ఛానళ్ల ప్రతినిధులపై ఆయన అనుచరులు దాడి చేశారు. హైదరాబాద్ లోని మాసాబ్‌ ట్యాంక్‌ సమీపంలో మీడియా వాహనాలను ఆపి వాటి అద్దాలను పగులగొట్టారు.

మీడియా ప్రతినిధులపై చేయి చేసుకుని, వారి కెమెరాలను ధ్వంసం చేశారు. మీడియాపై దాడిని ఖండించిన పలు మీడియా సంస్థలు దాడులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్‌ చేసి చట్టపరంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరింది.

కాగా, సిబిఐ విచారణకు అవినాష్‌రెడ్డి చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వరుసగా ఇది రెండోసారి. ఈ నెల 16న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ హైదరాబాద్‌ నుంచి కడప వెళ్లిపోయారు. దీంతో, సిబిఐ బృందం అంతేవేగంగా కడప చేరుకోవడం, అవినాష్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19న విచారణకు రావాలంటూ ఆయన డ్రైవర్‌కు నోటీసు ఇవ్వడం ఉత్కంఠ రేపింది.

అయితే అవినాష్ రెడ్డి  విచారణకు హాజరుకాలేక పోతున్నట్లు రాసిన లేఖ విషయంలో సిబిఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అవినాష్ రెడ్డి తీరుపై సిబిఐ సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.