ఆర్‌5 జోన్‌పై హైకోర్టు తీర్పుపై స్టేకు `సుప్రీం’ నిరాకరణ

రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులకు చుక్కెదురైంది. ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
 
ఆర్-5 జోన్‍పై వేసిన పిటిషన్లను సీజేఐ ధర్మాసనానికి ధర్మాసనం రిఫర్ చేసింది. రాజధాని రైతుల పిటిషన్లను సీజేఐకి రిఫర్ చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ రాజేశ్ బిందాల్ బెంచ్ నిర్ణయించింది. అమరావతిపై వేసిన పిటిషన్ల విచారణ మరో బెంచ్ చూస్తోందన్న ధర్మాసనం, మరో బెంచ్‍లో విచారణ జరుగుతున్నప్పుడు తాము విచారించడం సరికాదని తేల్చి చెప్పింది.
 
ఈ పిటిషన్లను ఏ ఉద్దేశంతో తమ వద్దకు పంపారో తెలియదన్న ధర్మాసనం, అమరావతి పిటిషన్లు విచారిస్తున్న బెంచ్ వద్దకు వేళ్లడమే సబబని ధర్మాసనం అభిప్రాయపడింది. శుక్రవారంలోగా రెండు పిటిషన్లపై విచారణకు జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు లిప్ట్ చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశించారు.

అమరావతి రైతులు ఆర్-5 జోన్‌ పై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గత వారం తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని సూచించింది. దీంతో అమరావతి రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాస్టర్ ప్లాన్ మార్చిందని రైతుల ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు తీర్పు ఇస్తూ అది చట్ట విరుద్ధమని ప్రకటించింది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసిందని, రాజధాని అవసరాల కోసమే తాము ఇచ్చిన భూముల్ని ఇతరులకు పంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.