కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక పంచాయితీ ఢిల్లీకి చేరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో తమకు స్పష్టమైన మెజారిటీ లభించినప్పటికీ శాసనసభా నాయకుడిని ఎన్నుకోవడంలో కాంగ్రెస్ నాయకత్వం పెద్దఎత్తున కసరత్తు చేయవలసి వస్తున్నది. ఆదివారం సాయంత్రం జరిగిన శాసనసభాపక్ష సమావేశం కేవలం తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి అప్పచెబుతూ తీర్మానం చేయడంతో సరిపెట్టారు.
ఆమేరకు డీకే శివకుమార్ తీర్మాణం ప్రవేశపెట్టగా, సిద్ధరామయ్య దాన్ని బలపర్చారు. ఎమ్యెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. మరోవంక, తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీల నిర్ణయం కోసం ఖర్గే ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి తీవ్రంగా పోటీపడుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలను సోమవారం ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది.
రాహుల్, ఖర్గే చర్చించిన తరువాత కర్ణాటక సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ భేటీకి ముందు కాంగ్రెస్ పరిశీలకులు పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన కెసి వేణుగోపాల్‌తో కలిసి సిద్ధరామయ్య, డికె శివకుమార్‌లతో మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం గురువారం(17వ తేదీ) ప్రమాణస్వీకారం చేస్తుంది.
కేబినెట్ ప్రమాణస్వీకారం తేదిని తెలిపిన కాంగ్రెస్ వర్గాలు ఆదివారం తమ ప్రకటనలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది వెల్లడించలేదు. అయితే సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్ఠానమే ప్రకటించాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బెంగుళూరులోని శాంగ్రీల్లా హోటల్ లో సీఎల్పీ భేటీ జరిగింది. ముఖాముఖీగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం నియమించిన పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు తీసుకుని హైకమాండ్‌కు నివేదించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను పరిశీలకులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియమించారు. మొదట డీకే శివకుమార్, సిద్దరామయ్యతో విడివిడిగా సమావేశమైన పరిశీలకులు తర్వాత ఇద్దరితో కలిసి చర్చించారు.
ఖర్గే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వేణుగోపాల్ సూచించారు. సమావేశం జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల కార్యకర్తలు బయట నినాదాలు చేశారు. కాగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మల్లికార్జున్ ఖర్గే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఈ నెల 24తో అధికారికంగా ముగుస్తుంది. ఈలోగా చాలా ముందుగానే తమ ప్రభుత్వ స్థాపన ప్రక్రియ సాఫీగా సాగుతుందని ఖర్గే చెప్పారు.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెరో రెండున్నరేండ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే తెచ్చారని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య అంగీకరించినా డీకే శివకుమార్ మాత్రం అలా వద్దని చెప్పినట్టు సమాచారం. సీఎం పీఠం కోసం పోటీ పడుతున్న శివకుమార్ ఆదివారం తుముకూరులోని సిద్దగంగ మఠాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చాలాసార్లు నేను పార్టీ కోసం త్యాగాలు చేసి సిద్ధరామయ్య వెంట నిలిచాను. సిద్ధరామయ్యకు నా వంతు సహకారం అందించాను’ అని పేర్కొన్నారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా