పాక్ సైన్యం రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

పాకిస్థాన్ సైన్యం తన బాధ్యతలు విస్మరించి రాజకీయాలు చేయడం విడ్డూరం, సిగ్గుచేటు అని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధ్వజమెత్తారు. తెరవెనుక రాజకీయాలు ఎందుకు? ఏకంగా సైన్యమే ఓ సొంత రాజకీయ పార్టీ పెడితే బాగా ఉంటుంది కదా? అని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్‌ మిలిటరీ తనను వచ్చే పదేండ్లు జైలులో ఉంచాలని ప్లాన్‌ చేసిందని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. దేశద్రోహం నేరం కింద తనను జైళ్లో ఉంచాలని ప్రణాళిక రచించిందని చెప్పారు.

దేశంలో అత్యంత శక్తివంతం, అవసరం అయినప్పుడు రాజకీయాధికార వ్యవస్థను ఏమైనా చేయగల్గుతుందనే పేరు తెచ్చుకున్న సైన్యంపై ఇమ్రాన్ తీవ్రస్థాయిలో దాడికి దిగారు. అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇస్లామాబాద్ కోర్టు బెయిల్‌తో విడుదలై బయటకు వచ్చిన తరువాత తొలిసారిగా ఇమ్రాన్ లాహోర్‌లోని తమ నివాసం నుంచి జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు.  సైన్యం రాజకీయాలు మితిమీరుతున్నాయని, సైనిక విభాగాల సంబంధిత ప్రజా సంబంధాల విభాగం పనిగట్టుకుని తనపై లేనిపోని నిందలకు దిగుతోందని ఇమ్రాన్ విమర్శించారు. అసలు తరచూ ప్రకటనలకు దిగుతోన్న ఆర్మీ అధికార ప్రతినిధి ఏం అర్హతతో మాట్లాడుతున్నాడనేది అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

 తాను పాకిస్థాన్ తరఫున పలు విషయాలలో ప్రపంచ స్థాయిలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ వ్యక్తి అసలు పుట్టి ఉంటారా? అని ప్రశ్నించారు. తాను ఎల్లవేళలా పాకిస్థాన్ జెండా ఉన్నతంగా ఎగిరేలా చేశానని, దీనిని గమనించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మర్యాద అన్పించుకుంటుందా? అని ప్రశ్నించారు.

ఇమ్రాన్ ఖాన్ ఓ హిపోక్రిట్, పైగా సైనిక వ్యతిరేకి అని ఇటీవలే పాక్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్‌చౌదరి విమర్శలకు దిగారు. ‘మిస్టర్ డిజి ఐఎస్‌పిఆర్ నీకెం పరిజ్ఞానం ఉందని, నాపై లేని పోని విషయాలకు దిగుతున్నావు. నువ్వెంత నీ వయస్సెంత? ’ అని ఇమ్రాన్ నిలదీశారు.

తన అరెస్టు నివారిస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా దేశంలోని దిగుమతి అయిన ప్రభుత్వం తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించిందని ఆరోపించారు. న్యాయస్థానం నుంచి వెసులుబాటు వచ్చిన తర్వాత కూడా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన అపహరణకు దిగారని పేర్కొన్న ఇమ్రాన్ దీని వివరాలు తెలియచేయలేదు.

పాకిస్థాన్‌లో ఇటీవలి ఘర్షణలు, హింసాత్మక చర్యలు కేవలం సైనిక వర్గాల ప్రోద్బలంతో కిరాయి మూకలు సృష్టించినవే అని ఆరోపించిన ఇమ్రాన్ ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.

దేశానికి ఇప్పుడున్న న్యాయవ్యవస్థనే ఆశాకిరణం అన్న ఇమ్రాన్, మీడియా పలు విధాలుగా అణచివేతలకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో జర్నలిస్టులు వారి అంతర్మాత ప్రభోధానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంటూ సైనిక బెదిరింపుల వాతావరణంలో కుంగిపోవద్దని పిలుపు నిచ్చారు.