సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్

సీబీఐ కొత్త డైరెక్టర్ గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే ఆయనను సీబీఐ  డైరెక్టర్ గా ఎంపిక చేయడం గమనార్హం.  1986 కర్ణాటక బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి  ప్రవీణ్ సూద్  రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సొనల్ అండ్ ట్రైనింగ్ వెల్లడించింది.

ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైశ్వాల్ వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం మే 25తో ముగియనుంది. ఆ తర్వాత ప్రవీణ్ సీబీఐ డెరెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు.  ప్రవీణ్ సూద్ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారంటూ   కెపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మార్చి నెలలో  ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని డీజీపీని అరెస్ట్ చేయాలని డీకే శివకుమార్ డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచుడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురీతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ మే 13వ తేదీన సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ పేరును ఖరారు చేసింది.

ప్రవీణ్ సూద్‌తోపాటు మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ కుమార్ సక్సేనా; ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తోన్న తాజ్ హసన్‌ పేర్లను సైతం సీబీఐ డైరెక్టర్ పదవి కోసం పరిశీలించారు. చివరికి కర్ణాటక డీజీపీ వైపే మొగ్గు చూపారు. ఈ పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకూ పొడిగించే వీలుంది.

కాగా ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న జైశ్వాల్‌.. 1985 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర క్యాడర్‌ అధికారి‌. గతంలో ఆయన ముంబై పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2021 మే 26న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.