ఓడినా ఓటు బ్యాంకును నిలబెట్టుకున్న బిజెపి

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడినా ఓటు బ్యాంకును నిలబెట్టుకుంది. సీట్లు తగ్గినా ఓట్ల షేర్‌‌‌‌ను గత ఎన్నికల మాదిరే రాబట్టింది. 2018 ఎన్నికల్లో 36.22 % ఓట్లు రాగా, ఈ సారి 36 % వచ్చాయి. అంటే కేవలం 0.22 శాతమే తగ్గింది. ఓట్ల చీలిక ప్రభావం కాంగ్రెస్‌‌కు కలిసి వచ్చింది. హస్తం పార్టీకి గత ఎన్నికల్లో 38.1% ఓట్లు పడగా, ఈ సారి 42.88% పడ్డాయి. అంటే 5 శాతం షేర్ పెరిగింది.

ఈ పెరిగిన షేర్ మొత్తం జేడీఎస్‌‌దే. కుమారస్వామి పార్టీ ఈ ఎన్నికల్లో 5 శాతం పైగా ఓట్లను కోల్పోయింది.  2018లో 18.36% ఓట్లు పడగా, ఈ సారి 13.29%కి తగ్గింది.  ఓట్లు తగ్గకున్నా సీట్లు మాత్రం బీజేపీకి భారీగా తగ్గిపోయాయి. గత ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ,  ఈసారి 65 సీట్ల దగ్గరే ఆగిపోయింది. అంటే 39 సీట్లు తగ్గాయి. అయితే ఓట్ల చీలిక వల్లే చాలా చోట్ల బీజేపీ ఓడిపోయింది.

ఉదాహరణకు బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి జనార్దన్ రెడ్డి హవా ఎక్కువ. ఆయన ఈ సారి ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌‌‌‌పీపీ)’ పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు. ఆయన, ఆయన భార్యతో పాటు మొత్తం 47 మంది పోటీ చేశారు. గాలి జనార్దన్‌‌రెడ్డి తప్ప మిగతా వారందరూ ఓడిపోయారు. కానీ ఓట్లను భారీగా చీల్చారు.

బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన సొంత సోదరులు గాలి సోమశేఖరరెడ్డి, గాలి కరుణాకరెడ్డి ఓటమికీ కారకులయ్యారు. కేఆర్‌‌‌‌పీపీ పోటీ చేసిన చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. బీజేపీని దెబ్బ కొట్టిన కేఆర్‌‌‌‌పీపీ, పరోక్షంగా కాంగ్రెస్‌‌కు లబ్ధి చేకూర్చింది. ఈ అనుకూల పరిణామంతో చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.

కాగా, ప్రజా వ్యతిరేకత తప్పించుకొనేందుకు గుజరాత్‌లో చేసిన కొత్త ముఖాల ప్రయోగం కర్ణాటకలో కలిసిరాలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 75మంది కొత్త అభ్యర్థులను పోటీ పెట్టగా, వీరిలో దాదాపు 20 మంది మాత్రమే గెలిచారు. అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు, నియోజకవర్గాల వైపు చూడని ఎమ్మెల్యేలను మార్చివుంటే సానుకూల ఫలితాలు వచ్చేవేమోనని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇలా ఉండగా, 12 మంది మంత్రులు పరాజయం చవి చూశారు. వరుణ, చామరాజనగర స్థానాల్లో పోటీ చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణ రెండు చోట్లా ఓడిపోయారు. రవాణా శాఖ మంత్రి బి.శ్రీరాములు బళ్లారి నియోజక వర్గంలో 29,300 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌ను చిక్కబళ్లాపుర ప్రజలు ఇంటికి సాగనంపారు.

చిక్కనాయకన హళ్లిలో న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి జేడీ(ఎస్‌) అభ్యర్థి సీబీ సురేశ్‌ చేతిలో ఓటమి చవి చూశారు. ఇతర మంత్రులు గోవింద్‌ కార్జోల్‌, ఎంటీబీ నాగరాజ్‌, కేసీ నారాయణ, మురుగేశ్‌ నిరాణి, హాలప్ప ఆచార్‌, బీసీ పాటిల్‌ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. శాసస సభాపతి విశ్వేశ్వర్‌ హెగ్డే శిర్సి స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో పరాజితులయ్యారు.