36 వేల మంది టీచర్లకు కలకత్తా హైకోర్టు ఉద్వాసన!

పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 36వేల మంది ప్రాథమిక ఉపాధ్యాయల నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తగిన శిక్షణ పొందనప్పటికీ వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకొంది. 2016లో ప్రభుత్వ ప్రాథమిక, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయుల భర్తీలో నిబంధనలు పాటించలేదని స్పష్టం చేసింది. ఇంత భారీ స్థాయి అవినీతిని పశ్చిమ బెంగాల్‌ ఎప్పుడూ చూసి ఎరగదని ఆదేశాలు ఇచ్చిన జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్‌లో 2016 లో నిర్వహించిన ప్రైమరీ టీచర్స్ ఉద్యోగాల భర్తీ విషయంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించిన  కలకత్తా హైకోర్టు వారిని ఉద్యోగాల నుంచి తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో దాదాపు 36 వేల మంది ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల టీచర్లు తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు.
 
ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బెంగాల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఇంత అవినీతి కుంభకోణం చూడలేదని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ తెలిపారు.  ఉద్యోగాల భర్తీలో నిబంధనలు పాటించలేదని, ప్రైమరీ టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ సమయంలో సరైన ట్రైనింగ్ ఇవ్వలేదని చెప్పారు.
 
ఈ కేసులో తన ముందు ఉంచిన సాక్ష్యాల ఆధారంగా అభ్యర్థులకు ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించలేదని వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు.  ఉద్యోగాల భర్తీలో బోర్డు అధ్యక్షుడు మానిక్ భట్టాచార్య భారీ అవినీతికి పాల్పడ్డారని, భారీగా డబ్బు చేతులు మారిందని కలకత్తా హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం మానిక్ భట్టాచార్య ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులో ఉన్నారు.
 
టీచర్ల నియామకాన్ని రద్దు చేయాలని ఆదేశించిన కలకత్తా హైకోర్టు నియామక పరీక్షకు మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2016 రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్న అభ్యర్థులు అందరికీ 3 నెలల్లోగా పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూ తో పాటు ఆప్టిట్యూట్ పరీక్షను నిర్వహించాలని, ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తిగా వీడియో తీయాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు ఆయా పాఠాశాలల్లోనే నాలుగు నెలలపాటు పారా టీచర్లుగా పనిచేయాల్సి ఉంటుందని, అందుకు తగ్గ వేతనాలు పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ టీచర్లుగా మళ్లీ ఎంపికయితే ఈ నాలుగు నెలల సర్వీసు కలుస్తుందని, జీతం బకాయిలు మాత్రం ఇవ్వబోరని పేర్కొన్నారు. పరీక్షలో ఉత్తీర్ణులు కానివారు ఉద్యోగాలు కోల్పోతారని తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో గరిష్ఠ పరిమితిని దాటినవారికి కూడా అవకాశం కల్పించాలని సూచించారు.
 
గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే మళ్లీ అవకాశం ఇవ్వాలని, కొత్తగా ఎవరినీ తీసుకోకూడదని ఆదేశించింది.  2014లో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారు 2016లో నిర్వహించిన ప్రైమరీ టీచర్స్ రిక్రూట్‌మెంట్‌కు హాజరయ్యారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన 42,500 మంది అభ్యర్థుల్లో కేవలం 6,500 మంది మాత్రమే ట్రైనింగ్‌ తీసుకున్నారు.
 
మిగిలిన 36,000 మందిని ప్రస్తుతం కోర్టు ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ ఉద్యోగాలను డబ్బులు ఇచ్చి కొంతమంది అభ్యర్థులు కొనుగోలు చేశారని మిగిలిన అభ్యర్థులు చేసిన ఫిర్యాదులతో ఈడీ రంగంలోకి దిగింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీగా అవినీతి జరిగిందని ఈడీ విచారణలో తేలిందని కోర్టు తెలిపింది.