జైల్లోనే ఇమ్రాన్‌ హత్యకు కుట్ర?

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఆయన అరెస్టు అక్రమమని పాక్‌ అత్యున్నత న్యాయస్థానం తేల్చిన నేపథ్యంలో ఇమ్రాన్‌ను ఆయన తరఫు న్యాయవాదులు కలిసి గంటకు పైగా ఆయనతో మాట్లాడారు.
 
అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ  తనను జైల్లో నిద్ర పోనివ్వట్లేదని ఇమ్రాన్‌ చెప్పినట్లు న్యాయవాదులు తెలిపారు. జైల్లో ఇమ్రాన్‌ను చిత్ర హింసలు గురి చేస్తున్నట్లు చెప్పారు. టాయిలెట్‌, బెడ్‌లేని ఒక గదిలో మాజీ ప్రధానిని ఉంచినట్లు పేర్కొన్నారు. వాష్‌రూమ్‌ వాడుకోవడానికి కూడా అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జైల్లోనే ఇమ్రాన్‌ను హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు ఆరోపించారు. ఆయనకు నెమ్మదిగా గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు, ఆహారం ఇచ్చినట్లు చెప్పారు. ఛాతీలో నొప్పిగా ఉందని ఇమ్రాన్‌ చెప్పినట్లు వారు వివరించారు. ఇక ఇస్లామాబాద్‌లోని పోలీస్‌ లైన్స్‌కు తీసుకొచ్చిన తర్వాత ఇమ్రాన్‌కు ఆహారం కూడా ఇవ్వడం లేదని న్యాయవాదులు వెల్లడించారు.
 
ఇలా ఉండగా, అల్‌ఖదీర్ ట్రస్ట్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్‌ఇఇన్సాఫ్(పిటిఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను మరేదైనా కేసులో మళ్లీ అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా అశాంతి ఏర్పడగలదని హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆయనకు రక్షణ బెయిల్ (ప్రొటెక్టివ్ బెయిల్) మంజూరు చేసిందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
 
విచారణ మొదటి సెషన్‌లో ఇస్లామాబాద్ హైకోర్టు ఇద్దరు సభ్యుల ప్రత్యేక డివిజన్ బెంచ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా నినాదాలు వినపడగానే విచారణను వాయిదా వేసి కోర్టు నుంచి నిష్క్రమించింది. అల్‌ఖదీర్ ట్రస్ట్ కేసులో మాజీ ప్రధానిని అరెస్టు చేయడం చట్ట విరుద్ధం అని సుప్రీంకోర్టు పేర్కొన్న మరునాడే ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను స్వీకరించింది.
 
అరెస్టు చేయబడతారా? అనే ఓ ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ ‘నేను అరెస్టు చేయబడతానని నాకు నూరు శాతం ఖచ్చితంగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.  ఇమ్రాన్‌పై ఉన్న అన్ని కేసుల్ని ఒకేద‌గ్గ‌రికి మార్చాల‌ని కోరుతూ ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టును కోరారు. కోర్టురూమ్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు నేప‌థ్యంలో విచార‌ణ రెండు గంట‌లు ఆల‌స్యంగా సాగింది.
 
  ఒక‌వేళ త‌న అరెస్టు కొన‌సాగితే అప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు ఉదృతం అవుతాయ‌ని కోర్టు విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ హెచ్చ‌రించారు. నినాదాల మధ్య ఆయన శుక్రవారం నమాజు కోసం విచారణను కొంత సేపు వాయిదా వేశారు. ఇమ్రాన్ ఖాన్ గట్టి బందోబస్తు మధ్య ఇస్లామాబాద్ హైకోర్టుకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున పోలీసు, పారమిలిటరీ బలగాలను కూడా మోహరించారు.