పతనం అంచున అమెరికా ఆర్ధిక వ్యవస్థ

ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా వ్యవస్థ పతనం అంచున ఉంది. కొత్తగా రుణాలు తీసుకోకుంటే ఆర్ధిక విపత్తును ఎదుర్కోక తప్పదని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా ముందు పొంచివున్న ఈ ఆర్థిక ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఇప్పటికిప్పుడు డెబిట్ సీలింగ్‌ పెంచుకోవడం ( రుణ గరిష్టపరిమితి) ఒక్కటే మార్గమని ఆ దేశ ఆర్థిక మంత్రే స్వయంగా వెల్లడించారు.
 
 కొత్తగా అప్పులు చేసేందుకు వీలుగా డెబిట్‌ సీలింగ్‌ పెంపునకు చట్టసభలు ఆమోదం తెలిపితేనే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని తెలిపారు. అమెరికా దివాళా తీస్తే.. ఆ ఒ క్కో దేశమే కాదు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావాల్సి వస్తుంది. కాబట్టి అమెరికా రుణ పరిమితి పెంపునకు ఆ దేశ చట్టసభలు ఆమోదం తెలపడం ఇప్పుడు చాలా అత్యవసరమని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై గరిష్ట పరిమితిని డెట్‌ సీలింగ్‌ అని వ్యవహరిస్తున్నారు. దీని ప్రకారం నిర్ధేశించిన పరిమితికి మించి ప్రభుత్వం అప్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్‌, రుణాలపై వడ్డీల చెల్లింపులు, పన్ను రిఫండ్‌లు వంటి అనేక ఖర్చులు చెల్లింపుల కిందకు వస్తాయి. మరిన్ని అప్పులు చేసేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం తప్పనిసరి. ఇప్పటికే అమెరికా పరిమితికి మించి అప్పులు చేసింది. ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది.

ప్రస్తుతం అమెరికా రుణ సీలింగ్‌ 31.4 బ్రి లియన్‌ డాలర్లుగా ఉంది. అమెరికా చేసే అప్పుల మొత్తం దీనికంటే ఎక్కువగా ఉండేందుకు వీలులేదు. జనవరిలోనే ప్ర భుత్వం ఈ రుణ సీలింగ్‌ పరిమితిని దాటేసింది. ప్రత్యేక చర్యల ద్వారా ఆర్ధిక శాఖ నిధులు సమకూర్చుతున్నది. కొత్త రుణాలు తీసుకునేందుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమెదం విషయంలో రాజకీయంగా చిక్కులు ఏర్పడుతున్నాయి.

ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మోజార్టీ ఉంది. రుణ పరిమితిన పెంచాలని కోరుతున్న అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా రుణాలు తీసకునే కంటే ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్ధిక నిర్వహణ మెరుగుపరుచుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనా జూన్‌ 1 నాటికి డెబిట్‌ సీలింగ్‌ పెంచకపోతే మాత్రం ఆర్థికంగా పెద్ద సంక్షోభం తప్పదని మాత్రం హెచ్చరిస్తున్నారు.

డెబిట్‌ సీలింగ్‌ పెరగకపోతే ప్రభుత్వ ఉద్యోగుల, మిలటరీ సిబ్బంది వేతనాలు, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోతాయి. జాతీయ పార్కులు సహా ఇతర ఏజెన్సీలు కూడా మూతబడతాయి. అలాగే ఇప్పటిదాకా అమెరికా ప్రభుత్వం తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీని సకాలంలో చెల్లించడం కూడా కుదరదు. ఈ పరిణామాలు దివాళాకు దారితీస్తాయి. దీంతో ఏజెన్సీలు అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ను తగ్గించేస్తాయి.

కొత్త రుణాలపై అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల సామాన్యులు తీసుకునే రుణాలపై కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇదే పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే స్టాక్‌ మార్కెట్లు పతనమవుతాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో కనీసం 4 శాతం క్షీణించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే 70 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.