ఇమ్రాన్ ను వెంటనే విడుదల చేయాలని `సుప్రీం’ ఆదేశం

పాకిస్థాన్‌ సుప్రీంకోర్టులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట లభించింది. అవినీతి నిరోధక సంస్థ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూర్‌ కస్టడీలో ఉన్న ఇమ్రాన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. పీటీఐ చైర్మన్‌ను అరెస్టును సవాల్‌ చేస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
 
ఈ మేరకు పిటిషన్‌పై విచారణ జరిపించిన సుప్రీంకోర్టు గంటలోగా ఇమ్రాన్‌ను సుప్రీంకోర్టులో హాజరుపరచాలని అధికారులను ఆదేశించింది. విచారణ సందర్భంగా షాబాజ్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌ అక్రమాల కేసులో ఇస్లామాబాద్‌ హైకోర్టుకు హాజరుకాగా కోర్టులోనే పాక్‌ సైన్యానికి చెందిన రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
 
ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హై కోర్టు ప్రాంగణం నుంచి ఎలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారని ప్రశ్నించింది. అరెస్ట్ అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలను ఖండించాలని ఇమ్రాన్ ఖాన్ కు సూచించగా, ఆ ఘర్షణల విషయం తనకు తెలియదని ఇమ్రాన్ సమాధానమిచ్చారు. తాను బయోమెట్రిక్ హాజరు కోసం సిద్ధమవుతుండగా కోర్టునుంచి తనను కిడ్నాప్ చేశారని, చిత్రహింసలకు గురి చేశారని విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
 
అరెస్ట్ అనంతరం తనతో దారుణంగా వ్యవహరించారని, కనీసం టాయిలెట్ కు వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదని, తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్ ఖాన్ పాక్‌ సుప్రీంకోర్టులో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను అప‌హ‌రించి క‌ర్ర‌ల‌తో కొట్టార‌ని, క‌స్ట‌డీలో తీవ్రంగా హింసించార‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానానికి నివేదించారు. 
ఇమ్రాన్‌ను అరెస్టు చట్టవిరుద్ధమన్న కోర్టు పాక్‌ను జైలుగా మార్చాడన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఇమ్రాన్‌ తరఫున న్యాయవాది హమీద్‌ వాదనలు వినిపించారు. కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు.
‘90 మంది అక్రమంగా కోర్టు ఆవరణలోకి ప్రవేశిస్తే అప్పుడు కోర్టు మర్యాద ఏమవుతుంది? కోర్టు లోపలే ఓ వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు? అరెస్టుకు ముందు వారు రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి కానీ వారు అలా చేయలేదు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణే. అరెస్టు క్రమంలో న్యాయస్థానం సిబ్బంది కూడా వేధింపులను ఎదుర్కొన్నారు’ అని విచారణ సందర్భంగా సుప్రీకోర్టు ఎన్‌ఎబిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఈ సందర్భంగా జస్టిస్‌ మినల్లా కలుగజేసుకుంటూ గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానకర రీతిలో నాబ్‌ అరెస్టు చేసిందని, దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని  తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ఇస్లామాబాద్‌ కోర్టును ఆశ్రయించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియల్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.