ప్రతిపక్ష కూటమి నేతగా శరద్ పవార్ పేరుతో కాంగ్రెస్ కు చెక్!

`భారత్ జోడి యాత్ర’  ద్వారా 2024 ఎన్నికల నాటికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్షాల మద్దతు కూడదీసుకొనేందుకు ఒకవంక కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుండగా, మరోవంక బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడదీసుకొనేందుకు పర్యటనలు ప్రారంభించిన జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించమని ఆహ్వానించారు.
2024 లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీని ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న  నితీశ్ కుమార్ గురువారం ఆయన ముంబైలో రాజకీయ కురు వృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. నితీశ్ కుమార్ తో పాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఆ భేటీలో పాల్గొన్నారు.
విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించబోతున్నారు? శరద్ పవార్ కు ఆ బాధ్యతలను అప్పగించబోతున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు నితీశ్ కుమార్ స్పందిస్తూ ‘‘ఆ విషయం శరద్ పవార్ తో మాట్లాడాను. విపక్ష కూటమికి ఆయన నాయకత్వం వహిస్తే, అంతకన్నా సంతోషించే విషయం ఏముంటుంది?’’ అని చెప్పారు. సొంత పార్టీ ఎన్సీపీ కోసమే కాదు.. దేశం కోసం కూడా కృషి చేయాలని శరద్ పవార్ ను కోరామని వెల్లడించాయిరు. ప్రస్తుతం దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఈ సమయంలో దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం అత్యంత అవసరమని నితీశ్ కుమార్, శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.
‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కలిసి పని చేస్తే, బీజేపీ కి ప్రత్యామ్నాయంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది’’ అని శరద్ పవార్ చెప్పడం ద్వారా ఆయన నాయకత్వం వహించడానికి సానుకూల సంకేతం ఇచ్చినట్లయింది. అయితే, పైకి మాత్రం నాయకత్వం సమస్య కాదని, ముందు అందరం కలిసి రావాలంటూ చెప్పారు.  నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ గురువారం ముంబైలో శివసేన ఉద్ధవ్ వర్గం చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
నితీష్ యత్నాలకు పట్నాయక్ మోకాలడ్డు!
ఇలా అండగా ప్రతిపక్ష కూటమికి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే ఒడిశా ముఖ్యమంత్రి, బీజేపీ అధినేత నవీన్ పట్నాయక్  మోకాలడ్డినట్లయినది.  మంగళవారం నితీశ్ కుమార్ నవీన్ పట్నాయక్ తో  ప్రత్యేకంగా భువనేశ్వర్ వెళ్లి సమావేశమై ఈ విషయమై చర్చలు జరిపారు. అయితే, రెండు రోజులకే నవీన్ పట్నాయక్ ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీకావడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది.
ఈ భేటీ అనంతరం తనకు సంబంధించినంత వరకు దేశంలో థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం లేదని నవీన్ పట్నాయక్  తేల్చి చెప్పారు. అంటే, బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పర్చేందుకు ప్రతిపక్షాలు జరుపుతున్న ప్రయత్నాలకు తన సహకారం ఉండబోదని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అయితే ప్రధానితో భేటీ సమయంలో ఈ అంశం చర్చకు వచ్చిందా? లేక నవీన్ పట్నాయక్ తన మనసులో మాట బయటపెట్టారా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
 అలాగే, బుధవారం రాంచీలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తో నితీష్ సమావేశమయ్యారు.  మే 18వ తేదీన ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న సానుకూల ప్రతిపక్ష నేతలతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్ ఆలోచిస్తున్నారు.