బిఆర్‌ఎస్ ప్రభుత్వం అయిదు నెలలే.. బిజెపి రాగానే 2 లక్షల ఉద్యోగాలు

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండేది అయిదు నెలలే… ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బిజెపియే. అధికారంలోకి రాగానే బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.

గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో ఆయన పాల్గొంటూ నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులకు పరిహారం ఇచ్చేదాకా.. అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. వచ్చే నెలలో హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతామని ఆయన ప్రకటించారు.

వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు.. కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలకా? అంటూ సంజయ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేలాది మంది నిరుద్యోగులు, బిజెపి శ్రేణులతో కలిసి ఐబి గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లె చౌరస్తా వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు బండి సంజయ్ నడిచారు.

సంగారెడ్డి జిల్లాకు ఒక్క కొత్త ఫ్యాక్టరీ అయినా వచ్చిందా? హామీలిచ్చిన నేతలంతా ఎటుపోయారు? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం 10 లక్షలు ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. కేంద్రం నిర్వహించే ఏ పరీక్షలోనూ తప్పిదాల్లేకుండా క్రమం తప్పకుండా భర్తీ చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఉద్యోగాలను నింపడం లేదు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని సంజయ్ విమర్శించారు.

కేసీఆర్ పాలనలో  రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని సంజయ్ విమర్శించారు. తొమ్మిదేళ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఇంతవరకు ఒక్క రైతు కుటుంబాన్ని కేసీఆర్  పరామర్శించలేదని ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ  చెయ్యలేదని.. అకాల వర్షాలకు నష్టపోతే ఒక్క రైతును కూడా ఆదుకోలేదని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన,  ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు.  మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలారా… అన్ని పార్టీలకు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి పాలించే అవకాశమివ్వండని సంజయ్ కోరారు. పొరపాటున కేసీఆర్ అధికారంలోకి వస్తే మరో రూ. 5 లక్షల కోట్ల అప్పు చేస్తారని హెచ్చరించారు.  

కేసీఆర్‌ బెదిరింపులకు తమ పార్టీ నాయకులెవరూ భయపడరని సంజయ్‌ స్పష్టం చేశారు. కేసులు, రౌడీషీట్లు, జైళ్లు.. ఇలా ఎన్నిరకాలుగా వేధింపులకు గురి చేసినా బీజేపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని చెబుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఇప్పటికే సగం మందిపై నాన్‌ బెయిలెబుల్‌ కేసులు పెట్టారని.. రౌడీషీట్లు, కమ్యునల్‌ కేసులు ఉన్నాయని, జైళ్లకు కూడా వెళ్లొచ్చారని తెలిపారు. తామెవరికీ భయపడబోమని, కేసీఆర్‌కే భయం అంటే ఏమిటో చూపించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేస్తామని హెచ్చరించారు.