కేసీఆర్ ఉదాసీనతతో ఉగ్రవాదుల అడ్డాగా పాత బస్తీ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయం నుండి హైదరాబాద్ నగరం, ముఖ్యంగా పాతబస్తి ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడి జరిగినా, ఎక్కడా ఉగ్రవాదులు పట్టుబడినా ఏదో ఒక విధంగా హైదరాబాద్ తో సంబంధం ఉంటూ వస్తున్నది. ఈ నగరాన్ని `షెల్టర్ జోన్’గా వారు ఉపయోగించుకొంటున్నట్లు పలు సందర్భాలలో స్పష్టం అయింది.
 
ఇతర రాష్ట్రాల పోలీసుల్లో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలో ఇతర రాష్ట్రాలలో అరెస్ట్ అయినవారి నుండి లభించిన సమాచారంతో ఇక్కడకు వచ్చి అరెస్టులు చేయడం గాని, తెలంగాణ పోలీసు వారి కదలికలపై గట్టిగా నిఘా ఉంచడంలేదని పలు సందర్భాలలో కేంద్ర నిఘా సంస్థలు చివాట్లు పెట్టాయి. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ వారికి అండగా ఉంటున్నట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
 
తాజాగా మధ్యప్రదేశ్‌ పోలీసులు మే 9న ఏకకాలంలో భోపాల్‌, హైదరాబాద్‌లలో నిర్వహించిన దాడుల్లో హెచ్‌యూటీకి చెందిన 16 మందిని అరెస్టు అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. మొత్తం మీద హైదరాబాద్ లో ఆరుగురు అరెస్ట్ అయ్యారు.
ప్రధాన నిందితుడైన మహ్మద్‌ సలీం అలియాస్‌ సౌరభ్‌రాజ్‌ 2018లో భోపాల్‌ నుంచి నగరానికి వచ్చాడు. ఓ వ్యాపారవేత్త సిఫార్సుతో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసి నిర్వహిస్తున్న డెక్కన్ వైద్య కళాశాలలో ఉద్యోగం సంపాదించాడు. ఏడాది క్రితం గోల్కొండ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని భార్య, ఆరుగురు పిల్లలతో ఉంటున్నాడు.
 
డెక్కన్ కాలేజీలో బయోటెక్నాలజీ హెవోడీగా హైదరాబాద్‌లో  హిజ్బు ఉత్ తహరీర్ (హెచ్‌‌‌‌యూటీ) సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింపచేసిన్నట్లు తెలియడంతో నిఘాసంస్థలు నివ్వెరపోయాయి.  ఉగ్రవాద కార్యకలాపాలకు స్థానికంగా రాజకీయనేతల అండదండలు లభిస్తున్నట్లు భావిస్తున్నారు. నిందితుల కాంటాక్ట్స్, సోషల్ మీడియా డేటాపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.
టెర్రర్ లింక్స్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. మెడికోలను ట్రాప్ చేసేందుకే సలీం డెక్కన్  మెడికల్ కాలేజీలో చేరినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐదేండ్లుగా డక్కన్ కాలేజీలో విభాగాధిపతిగా  పనిచేస్తున్నాడు. ఆన్ లైన్ లో సూసైడ్ బాంబర్స్, గ్రెనేడ్ దాడులు, కెమికల్స్ దాడులపై ట్రైనింగ్ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయాన్ పేరుతో సమావేశాలు నిర్వహించాడని గుర్తించారు. సమావేశాలకు ఎవరెవరు వెళ్లారనే వివరాలను తీసుకుంటున్నారు.  సలీం  ఇంట్లో సమావేశాలు ఎక్కువగా జరిగేవని గుర్తించారు.
భోపాల్ టు హైదరాబాద్ కు ఉగ్ర లింక్స్

హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది. విచారణలో భోపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
 
ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది.  కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించాగా పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
 
హిజ్బు ఉత్ తహరీర్ (హెచ్‌‌‌‌యూటీ)  సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరమైంది. జీవ, రసాయన ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టిస్తుంది.  హెచ్యూటీ టెర్రరిస్టులు అనంతగిరి కొండలను శిక్షణా కేంద్రంగా చేసుకున్నరు. డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నరని వెల్లడైంది.
 
మతమార్పిళ్లు ద్వారా యువత ఆకర్షణ
 
దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన ఉగ్రవాద సంస్థ హెచ్‌యూటీ వలకు అనేక మంది చిక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మత మార్పిళ్ల ద్వారా యువతను ఆకర్షించి తర్వాత వారిని విధ్వంసకారులుగా మార్చడమే లక్ష్యంగా హెచ్‌యూటీ సంస్థ పనిచేస్తున్నట్లు గుర్తించారు.  చదువుకున్నవాళ్లు, ధనవంతులు మాత్రమే ఎక్కువగా హెచ్‌యూటీలో సభ్యులుగా ఉండేవారని, ఈ సంస్థలో సభ్యత్వం అందరికి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు.

జగద్గిరిగుట్టలో అరెస్టైన కూలీ మహ్మద్‌ హమీద్‌ తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వెళ్లి మళ్లీ రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేవాడని, ఇతని గురించి చుట్టుపక్కల వారికి కూడా ఏమీ తెలియదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారంతా తమ వ్యక్తిగత వివరాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడేవారు.

ఉగ్ర దాడులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఆకర్షించేందుకే సౌరభ్ రాజ్‌ హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్ర దాడులకు కొత్త మార్గాలను అన్వేషించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఆకర్షించడానికి పథకం రచించినట్లు భావిస్తున్నారు. మెడికోలను ట్రాప్ చేసేందుకే భోపాల్కు చెందిన మహ్మద్ సలీం డెక్కన్ కాలేజీలో చేరినట్లు అనుమానిస్తున్నారు.

మతం మార్చుకున్నాకే ఉగ్రవాదంవైపు!

భోపాల్కు చెందిన మాన్సీ అగర్వాల్కు 2009లో సౌరబ్ రాజ్తో పెళ్లైంది. సౌరబ్ అప్పటికే ఇస్లామ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఇంట్లో నమాజ్ చేస్తూ ఉండేవాడు. దీనిపై ఇద్దరి మధ్య మొదట్లో గొడవ జరిగేది. 2010లో సౌరబ్ ఇస్లామ్‌లోకి మారాడు. దీంతో మాన్సీ అగర్వాల్ కూడా మతం మారాల్సి వచ్చింది.

 సౌరబ్ రాజ్ తన పేరును మహమ్మద్ సలీంగా మార్చుకున్నాడు. మాన్సీ పేరు మహ్మద్ రహీలగా మార్చుకుంది. ఓ ఇస్లామిక్ కోర్స్ కోసం ఇద్దరు దంపతులు 2018లో హైదరాబాద్ వచ్చారు.  గోల్కొండ బడాబజార్లో ఉంటున్న సలీం, డెంటిస్ట్ షేక్ జునైద్, అబ్దుల్ రహమాన్ కలిసి మెడికోలను ట్రాప్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

సలీం నెట్వర్క్పై ఆరా తీస్తున్నారు. దీని కోసం రాష్ట్ర పోలీసులు భోపాల్ వెళ్లారు. రహమాన్ ఎంఎన్సీ కంపె నీలో క్లౌండ్ సర్వీస్ ఇంజినీర్గా పని చేస్తుండటంతో ఐటీ ఉద్యోగులను ట్రాప్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టెకీలను ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్లాన్ చేసిన ఆధారాలు లభించినట్లు సమాచారం. వీకెండ్స్లో ఔట్డోర్ ట్రైనింగ్ పేరుతో భోపాల్, మహారాష్ట్ర, బెంగళూరుకు తీసుకెళ్లినట్లు గుర్తించారు.

రోహింగ్యాలకు ఓల్డ్ సిటీ షెల్టర్ జోన్ గా మారిందని తాము అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నామని గుర్తు చేస్తూ ఇప్పుడది నిజమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.  ‘‘ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మను 52 సార్లు పొడిచిన ఉగ్రవాదికి హైదరాబాద్లో షెల్టర్ ఇచ్చారు. పీఎఫ్ఐకి షెల్టర్ జోన్ ఎంఐఎం. రాజకీయాల కోసం ఉగ్రవాదులను మజ్లిస్ పెంచి పోషిస్తుంటే… ఓ వర్గం ఓట్ల కోసం ఆ పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతిస్తున్నయ్” అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఇన్నాళ్లూ లవ్ జిహాద్ మాత్రమే అనుకున్నామని, ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తున్నదని వెల్లడించారు. ‘‘హిందూ యువకులను బెదిరించి ముస్లింలుగా మార్చి..వారిని టెర్రరిస్టులుగా తయారు చేసి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా టెర్రరిస్టులే అనే ముద్ర వేయాలనే లక్ష్యంతో మజ్లిస్ ఉంది” అని ఆరోపించారు. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా ఉగ్రవాద కార్యకలాపాలపై సీఎం సమీక్ష చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.