ఎన్నారై మెడికల్ కాలేజీ సభ్యుల ఆస్తులు ఈడీ జప్తు

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్నారై మెడికల్ కాలేజీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది ఎన్నారై అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో కొద్ది నెలల క్రితం ఈడీ సోదాలు నిర్వహించింది. కరోనా సమయంలో రోగుల నుంచి కోట్లాది రుపాయలు వసూలు చేసినట్లు ఎన్నారై ఆస్పత్రిపై ఆరోపణలు వచ్చాయి.

ఈడీ దర్యాప్తులో అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఎన్నారై అకాడమీ సభ్యులు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, మణి అక్కినేని, ఇతర సభ్యులు కోట్లాది రుపాయలు అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో వీరికి చెందిన రూ.307.61 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.15.61 కోట్ల నగదుతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న భవనాలు, ఇతర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఎన్నారై అకాడమీ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌‌కు చెందిన నిధులను దారి మళ్లించి అక్రమాలకు పాల్పడినందుకు అక్కినేని మణి, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌లపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది.

ఎన్నారై మెడికల్ కాలేజీ వ్యవహారాలపై గత ఏడాది డిసెంబర్‌లో ఈడీ దర్యాప్తు చేపట్టింది. అకాడమీకి చెందిన నిధులను దారి మళ్లించడంతో పాటు కాలేజీ డైరెక్టర్లు మెడికల్ సీట్లను అక్రమంగా అమ్ముకున్నట్లు గుర్తించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా రోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు గుర్తించారు.

దీంతో పాటు ఎంబిబిఎస్‌, పీజీ మెడికల్ సీట్ల కేటాయింపులో మేనేజ్‌మెంట్ కోటా పేరుతో మెడికల్ సీట్లను అమ్ముకున్నట్లు గుర్తించారు. గుంటూరులో మెడికల్ సీట్లకు అమెరికాలో విదేశీ మారకం రూపంలో ఫీజులు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీల కోసం ఎన్నారైఏఎస్ పేరుతో ప్రైవేట్ షెల్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈడీ సోదాల్లో నగదు లావాదేవీలు, ఆర్ధిక వ్యవహారాల్లో అక్రమాలు నిర్దారణ కావడంతో వందల కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు తెలుస్తోంది.