విదేశీ కరెన్సీ కోసం టీటీడీ ప్రత్యేక యాప్

టీటీడీ వద్ద వున్న విదేశీ కరెన్సీ కొరకు ప్రత్యేకంగా పరకామణి మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను రూపొందించాలని ఈవో ఏవి ధర్మారెడ్డి టీటీడీ ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో గురువారం వివిధ బ్యాంకులకు చెందిన బ్యాంకు అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ టీటీడీలో నిల్వ ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతించినట్లు తెలిపారు. టీటీడీ వద్ద వున్న విదేశీ కరెన్సీని భారతీయ స్టేట్ బ్యాంకు కు కేంద్ర హోం శాఖ, ఎస్ బి ఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో చేర్చేందుకు పరకామణి మేనేజ్మెంట్ సిస్టం యాప్ ను త్వరగా రూపొందించాలని ఐ టి విభాగాధిపతి సందీప్ రెడ్డిని ఆదేశించారు.

అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న కరెన్సీ నోట్లు, నాణ్యాలను త్వరితగతిన తరలించాలని చేయాలని సంబంధిత బ్యాంకు అధికారులను కోరారు.
అనంతరం ఈఓ పరకమణిలో ఉన్న పాడైన, కట్‌ నోట్లను ఎలాంటి జాప్యం లేకుండా వాటిని తరలించందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత బ్యాంకర్లను కోరారు.

అంతకుముందు బ్యాంకర్లతో కలిసి లడ్డూ కౌంటర్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఇప్పటికే వివిధ బ్యాంకులు స్పాన్సర్ చేస్తున్న 30 కౌంటర్లు కాకుండా మిగిలిన కౌంటర్లను కూడా స్పాన్సర్ చేయాలని బ్యాంకర్లను ఈఓ కోరారు.

14 నుండి హనుమత్ జయంతి ఉత్సవాలు

కాగా, తిరుమలలో మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, అంజనాద్రి ఆకాశ గంగ, జపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి రోజు పీఠాధిపతులు అనుగ్రహభాషణం ఇవ్వనున్నట్లు చెప్పారు. తిరుమల వేద విజ్ఞాన పీఠంలో ఉద‌యం 6 నుండి రాత్రి 11 గంటల వ‌ర‌కు దాదాపు 18 గంట‌ల పాటు 67 మంది ప్రముఖ పండితులు ఈ అఖండ పారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తారని చెప్పారు.  ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుందని, విజయానికి ప్రతీక అయిన సుందరకాండ పరాయణంలో ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద నుండే పరాయణంలో పాల్గొనాలని ఆయన కోరారు.