18 వరకూ ఎండలు కొనసాగే అవకాశాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు మండుతున్నాయి. ఈ నెల 18 వరకూ ఇవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ గాలుల ప్రభావం, గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఎండలు పెరగనున్నాయి. బుధవారం విజయవాడలో 39 డిగ్రీలకు చేరగా విశాఖలో 37.5 డిగ్రీలు నమోదైంది. 40 డిగ్రీలను తాకకపోయినా ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.

గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పలు పట్టణాలు, నగరాల్లో ఎండలు 40 డిగ్రీలు దాటకపోయినప్పటికీ అంతటి తీవ్రత చూపినట్లు అనిపిస్తుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆగేయ బంగాళాఖాతంలో వాయుగుండం వేగంగా కదులుతూ ఈ నెల 11 నాటికి తీవ్ర తుపానుగా ఆగేయ బంగాళాఖాతంలో బలపడనుంది.

ఆ తర్వాత ఇది క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా మే 13 నుంచి కొద్దిగా బలహీనపడి ఉత్తర మయన్మార్‌, బంగ్లాదేశ్‌ క్యుక్ప్యు (మయన్మార్‌) మధ్య మే 14వ తేదీ నాటికి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ నైరుతి దిశగా వంగి ప్రయాణించనున్నట్లు వాతావరణ శాఖ విశ్లేషణ చేస్తోంది.

ఈ తుపాను వెళ్లాక మూడు నాలుగు రోజుల తర్వాత గానీ వాతావరణం చల్లబడే అవకాశం లేదు. నైరుతి గాలులు (సౌత్‌ వెస్టర్న్‌ విండ్స్‌) వచ్చాక వర్షాలు పడతాయి. అంటే ఈ నెల 18వ తేదీ పట్టచ్చని అర్థమవుతోంది. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా ప్రాంతాల్లో జంగమేశ్వరపురం 40.5 డిగ్రీలు, కడప 40.2 డిగ్రీలు నమోదయ్యాయి. అమరావతి, నందిగామ, కర్నూలు, నంద్యాలలో 39.6 డిగ్రీలు, విశాఖలో అత్యల్పంగా 34 డిగ్రీలు నమోదైంది.