బిజెపి ఛార్జిషీట్ల ఉద్యమానికి విశేష స్పందన

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఛార్జిషీట్ల ఉద్యమానికి గ్రామస్ధాయి నుంచి మంచి స్పందన వస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించడంతో పాటు ఆధారాల సేకరిస్తున్నామని తెలిపారు.
 
శక్తి కేంద్రాలు అంటే నాలుగు పోలింగ్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్రంగా బీజేపీ పార్టీ కార్యక్రమం రూపొందించుకుందని చెబుతూ అందుకు అనుగుణంగా 5000 శక్తి కేంద్రాల్లో బీజేపీ నేతల పర్యటనలు కొనసాగాయని తెలిపారు. విజయవాడ వన్ టౌన్‌లో బీజేపీ శ్రేణులు కాలనీల్లో పర్యటించి అభియోగాలు నమోదు చేశారని పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా కార్పోరేషన్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా అభియెగాలను స్వీకరించారని చెప్పారు. అరసవల్లిలో కేంద్రం నిధులను దారి మళ్లించిన సంఘనలు ఉన్నాయని బీజేపీ నేతలు ప్రకటించారని, నెల్లిమర్లలో అధికార పార్టీ వైసీపి నేతలు అవినీతికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయని వివరించారు.
 
 భీమవరం సమీపంలోని పాలకోడేరులో ఎస్సీ కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలపై బీజేపీ నేతలు అభియోగాలు నమోదు చేశారని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైయ్ అధికారుల వల్ల సమస్యలు ఉన్నాయని రైతాంగం బీజేపీ నేతల దృష్టికి తెచ్చారని తెలిపారు.
రాయలసీమలో అన్నమయ్య డ్యాంకు సంబంధించిన సమస్యపై ఇప్పటికే బీజేపీ కోర్టులో కేసు వేసిందని గుర్తు చేశారు. బద్వేలు తదితర ప్రాంతాల్లో సమస్యలపై బీజేపీ నేతలు అభియోగాలు నమోదు చేశారని సోమువీర్రాజు పేర్కొన్నారు.