తిరుపతి వందేభారత్‌ కు రెట్టింపు కోచ్ లు

 
గత నెలలో ప్రారంభమైన సికింద్రాబాద్‌- తిరుపతి (20701) మధ్య నడిచే వందేభారత్‌ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దానితో
సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రయాణికుల రద్దీతో పాటూ తిరుమలకు వెళ్లే భక్తుల నుంచి ఆరణ వస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు.
 
ఈ రైలుకు ఉన్న డిమాండ్‌ను వివరించడంతో వందేభారత్‌ రైలులో కోచ్‌ల సంఖ్య పెంచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బోగీలను రెట్టింపు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.  ‘యాత్రికులు, ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్యన తిరుగుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రస్తుతం ఉన్న 8 కోచ్ ల నుండి 16 కోచ్ లకు పెంచటానికి అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు’ తెలుపుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్‌ చేశారు.

హైదరాబాద్ నుంచి తిరుమల పర్యటించేవారికి ఈ రైలు చాలా సౌకర్యంగా ఉంటోందని భావిస్తునానరు. తిరుమల వెళ్లే వారు ఈ రైలులోనే తిరుపతి వెళతారు. తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుని మళ్లీ అదే రైల్లో తిరిగి హైదరాబాద్ వచ్చేలా చేసుకుంటున్నారని చెబుతున్నారు.  ఈ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. మంగళవారం మాత్రం నడవదు. రైలుకు సంబంధించిన మెయింట్‌నెన్స్ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఈ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కేవలం ఎనిమిదన్న8 గంటల్లోనే వెళ్లొచ్చు.

 
 రైలులో ప్రస్తుతం 7 ఏసీ బోగీతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కారు బోగీ అందుబాటులో ఉంది. కానీ ప్రయాణికుల నుంచి ఆదరణ పెరగడంతో బోగీల సంఖ్యను 16కు పెంచుతున్నారు. వందేభారత్ రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి వెళుతుంది. మళ్లీ తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి, రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి:  ఛైర్‌కార్‌ టికెట్ ధరలు – సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వరకు రూ. 1680 ఛార్జీ వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి నెల్లూరు రూ. 1270, సికింద్రాబాద్ నుంచి ఒంగోలు రూ. 1075, సికింద్రాబాద్ నుంచి గుంటూరు రూ. 865, సికింద్రాబాద్ నుంచి నల్గొండ  రూ.470 ఛార్జీలుగా నిర్ణయించారు.

 
ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్ టికెట్ ఛార్జీలు: సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి  రూ. 3080,  సికింద్రాబాద్ నుంచి నెల్లూరు రూ. 2455, సికింద్రాబాద్ నుంచి ఒంగోలు రూ. 2045, సికింద్రాబాద్ నుంచి గుంటూరు రూ. 1620, సికింద్రాబాద్ నుంచి నల్గొండ రూ. 900 ఛార్జీలుగా నిర్ణయించారు.