ఇమ్రాన్ అరెస్ట్ తో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి

ఒక అవినీతి కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను పారామిలటరీ రేంజర్స్‌ కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ మంగళవారం అరెస్టు చేశారు. దానితో  ఇమ్రాన్‌ అరెస్టును నిరసిస్తూ పీటీఐ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. పార్టీ మద్దతుదారులు పలు నగరాల్లో ఆందోళనలు చేపట్టారు.

ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. లాహోర్, పెషావర్, కరాచీ, గిల్గిట్, కరక్, క్వెట్టా సహా పలు నగరాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పాకిస్థాన్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. అలాగే ప్రభుత్వానికి చెందిన ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. తన భార్య బుషారా బీబీకి చెందిన అల్‌ ఖదీర్‌ అనే ట్రస్ట్‌కు రూ.53 కోట్ల విలువైన భూమిని అక్రమంగా బదలాయింపు చేశారన్న కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసినట్టు ఇస్లామాబాద్‌ పోలీసులు ప్రకటించారు.

ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు పలుచోట్ల పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేశారు. పెషావర్‌లోని పాకిస్థాన్‌ రేడియో భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈనేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఇంటర్నెట్‌ సేవల్ని బంద్‌ చేసింది. 144 సెక్షన్‌ విధించింది. ఫైసలాబాద్‌లోని హోంమంత్రి ఇంటిపై పీటీఐ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు.

రావల్పిండిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై, లాహోర్‌లోని ఆర్మీ కమాండర్‌ ఇంటిపై ఇమ్రాన్‌ అనుచరులు దాడికి దిగారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం గేటును ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల ముందు పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రావల్పిండి, లాహోర్‌, కరాచీ, గుర్జాన్‌వాలా, ఫైసలాబాద్‌, ముల్తాన్‌, పెషావర్‌, మర్దాన్‌లలో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఆందోళనలు తీవ్రంగా జరుగుతుంటంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ట్విట్టర్, ఫేస్‍బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍లను పాకిస్థాన్ ప్రభుత్వం బ్లాక్ చేసింది.  చాలా చోట్ల ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. సోషల్ మీడియాలో ఆందోళనలకు సంబంధించిన విషయాలు వ్యాప్తి కాకుండా ఈ చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‍లో యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‍బుక్ పనిచేయడం లేదని వేలాది మంది యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‍సైట్ డౌన్‍డిటెక్టర్ వెల్లడించింది.

కాగా, ఇమ్రాన్‌ను హింసించామన్న ఆరోపణల్ని పాక్‌ ప్రభుత్వం ఖండించింది. ఇమ్రాన్‌ వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్టు తెలిపింది. గతేడాది ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్‌ఖాన్‌పై 120కిపైగా కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు, ఆర్మీ కొద్ది నెలలుగా ప్రయత్నిస్తున్నది.ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులంతా ఇస్లామాబాద్‍లోని జ్యుడిషియల్ కాంప్లెక్స్‌కు బుధవారం ఉదయం రావాలని పీటీఐ పార్టీ పిలుపునివ్వటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టబద్ధమేనని ఇస్లామాబాద్ హైకోర్టు చెప్పింది. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు పీటీఐ పార్టీ సిద్ధమైంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిలుపుదల చేసి ఆయనను విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఉదయం సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని పీటీఐ పార్టీ ఉపాధ్యక్షుడు ఫావద్ చౌదరి వెల్లడించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ తన అరెస్టుకు ముందు అక్కడి పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు తన అరెస్టుకు కొన్ని గంటల ముందు ట్విటర్‌లో ఒక వీడియో పెట్టారు. ఈ డఫర్‌గాళ్ల (మంద బుద్ధిగల వాళ్లు) కింద బతుకడం కంటే చావడానికే తాను సిద్ధంగా ఉన్నానని ఆ వీడియోలో ఖాన్‌ వ్యాఖ్యానించారు. మీరు సిద్ధంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. తన మీద ఎలాంటి కేసులు లేవని, అయినా తనను జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు.