హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కలకలం.. 16 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో భారీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) 16 మందిని అదుపులోకి తీసుకుంది.  ఇందులో భోపాల్‌కు చెందినవారు 11 మంది ఉండగా,  హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు ఐదుగురు ఉన్నారు.
ఇంటెలిజెన్స్ సమాచారంతో భోపాల్, హైదరాబాద్‌లో ఆపరేషన్ చేసి నిందితులను పట్టుకున్నారు.  నిందితులను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్‌కు పోలీసులు తరలిస్తున్నారు.  ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన పోలీసులు హైదరాబాద్ లో 16 మందిని ఉగ్రవాదులు అనే అనుమానంతో అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.
దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదే క్రమంలో ప్రజలు సైతం షాక్ అయ్యారు. హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు., . 16 మంది అరెస్ట్ వార్తలతో  గతంలో లుంబిని పార్క్, దిల్ ఖుష్ నగర్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్లను గుర్తు చేసుకుంటున్నారు.  నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, జిహాదీ మెటీరియల్‌, కత్తులు, ఎలక్ట్రానిక్ డివైస్‌, ఎయిర్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన వారి నుంచి భారీ స్థాయిలో ఇస్లామిక్ జిహ‌దీ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రెయిడ్‌లో క‌త్తులు, ఎయిర్ గ‌న్స్‌ను కూడా సీజ్ చేశారు.  యువతను ఉగ్రవాదం వైపు టెర్రరిస్టులు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 18 నెలల నుంచి హైదరాబాద్‌లోనే మకాం వేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
నిందితులతో సంబంధం ఉన్న వారిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. అరెస్ట్ అయిన వారితో సంబంధాలు ఉన్నవారి కోసం పోలీసులు వెతుకులాట మొదలు పెడుతున్నారు.  హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు ఎవరికీ తెలియకుండా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
నిందితులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదై ఉన్నట్లు గుర్తించారు.