అశోక్ గెహ్లాట్ రాజకీయ కుట్ర … వసుంధరా రాజే మండిపాటు

2020లో తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కాంగ్రెస్ లోని ఒక వర్గం, బీజేపీలోని అగ్రనాయకత్వం కుటిల యత్నాలు జరిపినప్పుడు బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కారణంగానే తన ప్రభుత్వం గట్టెక్కిన్నట్లు ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వాఖ్యలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో కలకలం రేపాయి.

వీటిపై తీవ్రంగా మండిపడ్డ వసుంధర రాజే తనపై ఆయన చేసిన ప్రకటనను ఒక కుట్రగా ఆమె పేర్కొన్నారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌లో తిరుగుబాట్లతో ఆయన సతమతమవుతున్నారనడానికి ఆయన ప్రకటనలే నిదర్శనమని ఆమె ధ్వజమెత్తారు. గెహ్లాట్‌ అవమానించినంతగా తనను ఎవరూ అవమానించలేదని బిజెపి నేత తెలిపారు. సొంత పార్టీలో కుంపటి రాజుకోవడంతో 2023 ఎన్నికల్లో గెలవమనే భయంతోనే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

‘నాపై గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర. గెహ్లాట్ అవమానించినంతగా నన్నెవరూ అవమానించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అబద్ధాలు చెబుతున్నారు. సొంత పార్టీలోని తిరుగుబాటు కారణంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని వసుంధర రాజే తెలిపారు.

ధోల్‌పూర్‌లో ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో గెహ్లాట్ మాట్లాడుతూ, 2020 సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ మంత్రులు కొందరు కుట్ర పన్నారని, అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి వసుంధరా రాజే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహ ఇష్టపడలేదని చెప్పారు.

ఆ కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బతికి బట్టకట్టిందని ఆయన తెలిపారు.  తిరుగుబాటుకు సిద్ధపడి బీజీపీ నుంచి డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేలకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయమని, అందువల్ల వారిపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందని కూడా తాను విజ్ఞప్తి చేశానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అశోక్ గెహ్లాట్ 2020 జూలైలోనే సంచలన ఆరోపణ చేశారు.   అయితే, ఈ ఆరోపణలను బీజేపీ అప్పట్లోనే ఖండించింది. 2020కి ముందు నుంచే కాంగ్రెస్ లో గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు తలెత్తాయి.

పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాష్ట్ర కాంగ్రెస్ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి ఆయన గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లో బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించడంలో గెహ్లాట్ విఫలమయ్యారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఒకరోజు నిరాహార దీక్షకు కూడా దిగారు.

దీనికి ముందు గెహ్లాట్‌కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి పదవిని కట్టబెట్టి, పైలట్‌కు రాజస్థాన్ సీఎం పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. అయితే, రాష్ట్ర పగ్గాలు వదులుకునేందుకు గెహ్లాట్ అంగీకరించకుండా పైలట్ ఆశలపై నీళ్లు చల్లారు. ఈ ఇద్దరు నేతల మధ్య గతంలోనూ పలుమార్లు విభేదాలు తలెత్తాయి.