నోలంబ పల్లవుల విద్యా విధానం తెలిపే శాసనం

 శ్రీసత్యసాయి జిల్లా మడకశిరకు 34 కి.మీ.ల దూరంలోని హేమావతి సిద్ధేశ్వరాలయం ముందు గల పెద్ద స్తంభ శాసనంలో నోలంబ పల్లవ వంశ వివరాలు, నోలంబ రాజులు పాటించిన మత ధర్మం,అమలుచేసిన విద్యావిధానం వంటి ఆసక్తికర అంశాలున్నట్టు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు.  హేమావతి (హెంజేరు)కేంద్రంగా విలసిల్లిన నోలంబవాడి రాజ్యంపై పరిశోధనచేస్తున్న మైనాస్వామి పెద్ద స్తంభ శాసనంలోని విషయాలను వెల్లడించారు.

నోలంబపల్లవుల మతధర్మం, విద్యావిధానం, అభివృద్ధిచేసిన శిల్ప కళ చాలా గొప్పవని ఆయన అభివర్ణించారు. ఇరివనోలంబ అనే దిలీప రాజ ఆ స్తంభ శాసనాన్ని క్రీ.శ.943 లో ఆ శాసనాన్ని రాయించాడు.  నోలంపల్లవ వంశ మూలపురుషుడు-త్రినేత్ర పల్లవప్రభువు నుంచి ఇరివనోలంబ వరకు రాజుల పేర్లున్నాయి.’తాము ముక్కంటి ఈశ్వర వంశస్థులం, తమ వంశ మూల పురుషుడు-త్రినయన ప్రభువు, తాము పల్లవుల వారసులం’అని స్తంభ శాసనంలో చెప్పుకొన్నారు. దీనిని బట్ హేమావతి శాసనాన్ని నోలంబపల్లవప్రశస్తి శాసనంగా పేర్కొనవచ్చు అని మైనాస్వామి చెప్పారు.

ఇరివనోలంబ దిలీపరాజ క్రీ.శ.940 నుంచి 969 వరకు రాజ్యపాలనచేశాడు. త్రినయన,మంగళ, సింహపోత, చారుపొన్నేర, పొలచోర, మహేంద్రాధిరాజ, అయ్యపదేవ, అన్నిగవీరనోలంబ, ఇరివనోలంబ రాజులపేర్లు శాసనంలో వున్నాయి.  నోలంబ పల్లవుల గొప్పతనం, పరిపాలన, మతధర్మం, విద్యాభివృద్ధి కోసం ఘటికస్థానలు మఠాలకు భుములు, బంగారు దానాలు, విద్య నేర్చుకొనేవారికి ఉచిత బొహోజన-వస్త్ర-వసతి సౌకర్యాల కల్పన తదితర విషయాలను స్తంభ శాసనం వెల్లడిస్తున్నది. శైవమత ప్రచారకుడు, పాశుపత శాఖ వ్యవస్థాపకుడు లకులీశుడు శివుని అవతారంగా భావించారు.

లకులీశుని బోధనల ప్రభావంతో నోలంబరాజులు తమ  రాజ్యంలో పాశుపత మతవ్యాప్తికి బాగా పాటుబడ్డారు. లకులీశుని శిష్యులు నోలంబవాడిలో మఠాలు సాపించారు. మఠాల నిర్వహణకు నోలంబరాజులు విరివిగా భూదానాలు చేశారు. లకులీశుని శిష్య పరంపరలో ఒకరైన మునినాథ చిల్లుక భట్టారక హేమావతిలో నివసించాడు.

 పాశుపత సూత్ర గురు పరంపరలో ప్రధముడైన లకులీశుని మరోఅవతారం మునినాథ చిల్లుక భట్టారక అని వారి శిష్యులు భావించారు. ఇరివ నోలంబ అనే దిలీపరాజ, రాజగురువైన చిల్లుక భట్టారక మఠానికి క్రీ.శ. 943లో భూదానం చేసినట్టు స్తంభ శాసనo చెబుతున్నది. శాసనంలో సంస్కృతం మరియు ప్రాచీన కన్నడ భాషలున్నాయి. అక్షరాలు అత్యంత సుందరంగా,పోతపోసినట్టున్నాయి.

 నాలుగు ముఖాలు గల స్తంభంలో 72 వరుసల్లో శాసనం వుంది. మొదటి ముఖంలో సంస్కృతం వుండగా,రెండో ముఖంలో కన్నడం వుంది.”స్వస్తి శ్రీమానీశ్వర వంశజ త్రిణయన: కాంచీపతిర్ పల్లవ జాత: తత్కులజ: కిరాత నృపతిo ” అని శాసనం మొదలవుతుంది.  శాసనకర్త ఇరివనోలంబదిలీపరాజ పేరు, దానంచేసిన సంవత్సరం…శోభకృత్-సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం(943 జనవరి) అని రెండు,మూడు ముఖాల్లో కలదు.దాన స్వీకర్త-రాజ గురువు శ్రీమాన్ మునినాథ చిల్లుక భట్టారక గురించి మూడు,నాలుగు ముఖాల్లో వుంది.

నోలంబపల్లవ వంశ మూలపురుషుడు-త్రినేత్ర పల్లవప్రభువు కాశి నుంచి పండితులను పిలిపించి అగ్రహారాలు కట్టించాడు. అగ్రహారాలు విద్యాకేంద్రాలయ్యాయి. త్రినేత్ర బాటలోనే నోలంబులు నడిచారు. కాశి నుంచి పలువురు భట్టారకులను హేమావతి ఆహ్వానించారు. వారికోసం అగ్రహారాలు, విద్యాబోధనకు ఘటికస్థానాలు నెలకొల్పారు.

నోలంబరాజ్యం ఏర్పడకముందే జైన మునుల ఆధ్వర్యంలో రత్నగిరి, అమరాపురం, పెనుకొండ, కొనకొండ్లలో ఘటికస్థానాలు ఆవిర్భవించాయి. జైన ఘటికస్థానాలు-హిందూఘటికస్థానాల్లో విద్యాబోధన, శిల్పకళా శిక్షణ భిన్నంగా సాగుతుండేది. క్రమంగా హిందూఘటికస్థానాలు పెరిగాయి. అదేవిధంగా ఆలయాలు,మఠాలు విద్య మరియు సాంస్కృతిక కేంద్రాలుగా మారాయి.

ప్రాచీనకాలంలో గుడి వివిధ రకాలుగా సేవలందించింది. దేవాలయం కేవలం భక్తి- ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. మానవ విలువలు – సనాతన ధర్మ వ్యాప్తికి తోడ్పడింది. విద్య, వైద్యం, సంస్కృతి, పరిపాలన కేంద్రంగా వుపయోగపడింది. ఆలయాల్లో రాజులు దర్బారులు. నిర్వహించి ప్రజాసమస్యలను పరిష్కరించినట్టు ఆధారాలున్నాయి.

మత ధర్మo: నోలంబపల్లవులు స్వతహాగా శైవమత ధర్మాన్ని పాటించినా సర్వమత ధర్మాన్ని ఆదరించారు. జైనబసదిలు, వైష్ణవగుడులను కట్టించడమేగాక చెరువుల కింద భూములను దానంగా ఇవ్వడం వారి దాతృత్వానికి నిదర్శనం. నోలంబులు సర్వమత ఆదరణ సూత్రం వల్ల రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతో జీవించారని చెప్పవచ్చు.

నోలంబ రాజ్య రాజధాని హెంజేరు(హేమావతి)లోనే గాక రాజ్యంలో పలుచోట్ల దేవాలయాలను కట్టించారు.రాజుల ఆదరణతో శైవ మఠాలు మతవ్యాప్తికి దోహదపడ్డాయి. గుడులు, మఠాలు ఘటిక స్థానాలుగా విద్యను బోధించాయి.