సోనియాగాంధీ `సార్వభౌమాధికారం’ వ్యాఖ్యలపై దుమారం

కర్ణాటక ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగుస్తున్న సమయంలో రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. సుమారు నాలుగేళ్ల తర్వాత హుబ్లీలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆమె చేసిన వాఖ్యలపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపి ఎన్నికల కమీషన్ కు సోమవారం ఫిర్యాదు చేసింది.

కర్ణాటక హుబ్లీలో జరిగిన ప్రచారంలో సోనియా గాంధీ సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారు. కర్ణాటక రాష్ట్ర ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని ఆమె స్పష్టం చేశారు. సోనియా ఆ స‌భ‌లో మాట్లాడిన విష‌యాన్ని  కాంగ్రెస్ ట్వీట్‌ కూడా చేసింది.

అయితే సోనియా సార్వభౌమాధికారం అన్న ప‌దాన్ని వాడ‌డం ప‌ట్ల బీజేపీ అభ్యంత‌రం వ్యక్తం చేసింది.  సోమవారం ఢిల్లీలో ఎన్నికల కమీషన్ అధికారులను బీజేపీ నేతలు కలిసి సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు.  సార్వభౌమ‌త్వాన్ని దేశం కోసం వాడుతామ‌ని, అందుకే సోనియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఈసీని బీజేపీ నేతలు  కోరారు.

సార్వభౌమాధికారం అనే పదాన్ని సోనియా గాంధీ కావాలనే ఉపయోగించారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మండిపడ్డారు.  కాంగ్రెస్ మేనిఫెస్టో పనికిమాలినదని, అందుకే అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు.

కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే కూడా సోనియా గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఈ ప్రకటన ‘దిగ్భ్రాంతికరం, ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొంటూ ఆమె  ఫిర్యాదు దాఖలు చేశారు. సోనియా గాంధీ మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలు ఉల్లంఘించారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆమె అభ్యర్థించారు.

బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ కరంద్లాజే ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఈసిని అభ్యర్థించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో  తుక్డే తుక్డే ముఠా ఎజెండా అని, అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని ఆమె మండిపడ్డారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహితం సోనియా వాఖ్యలపై మండిపడ్డారు. అబద్ధాలు పనిచేయడం లేదు కాబట్, ఆఖరు నిమిషంలో సీనియర్ నేత (సోనియా గాంధీ)ని కాంగ్రెస్‍ ప్రచారానికి తీసుకొచ్చిందని ఆయన   విమర్శలు సంధించారు. భారత సార్వభౌమత్వాన్ని కించపరిచేలా కాంగ్రెస్ చర్యలు ఉంటున్నాయని ఆయన విమర్శించారు. కర్ణాటకను భారత్ నుంచి వేరు చేయాలని కాంగ్రెస్ అనుకుంటోందని ఆయన ఆరోపించారు.