‘ది కేరళ స్టోరీ’ సినిమాపై మమతా నిషేధం

విడుదలైన నాలుగు రోజులలోనే దేశ వ్యాప్తంగా విశేషమైన స్పందన లభిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలయంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాశ్మీర్ ఫైల్స్ తరహాలో బెంగాల్‌పై సినిమాకు బీజేపీ నిధులు సమకూరుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన కొద్ది నిమిషాలకే ఈ ప్రకటన వెలువడింది.
 
ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడులో ముల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో ప్రదర్శించడం లేదు. పలు రాష్ట్రాల హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు కొందరు వెళ్లి ఈ సినిమాను నిషేధించామని కోరినా న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఇక విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ దాదాపు రూ. 35 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. మొదటగా మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధంకు పూనుకొంది.
 
రాష్ట్రంలో నడుస్తున్న స్క్రీన్‌ల నుంచి ది కేరళ స్టోరీ సినిమాను తొలగించేలా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. బెంగాల్‌లో శాంతిని నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. నేరాలు, హింసను ద్వేషించేలా ఉన్న వాటిని బెంగాల్‌లోకి అస్సలు అనుమతించబోమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
 
అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీని కేరళలో మతపరమైన బోధన, హిందూ, క్రైస్తవ స్త్రీలను రాడికల్ ఇస్లామిక్ మతాధికారులు ఎలా టార్గెట్ చేస్తున్నారు అనే దానిపై  తీశారు. మహిళలు ఇస్లాం మతంలోకి మార్చబడ్డారని, తరువాత ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియా వంటి దేశాలకు వారిని తరలించారని ఈ సినిమా చూపించారు.
 
అసలైన పాన్ ఇండియా మూవీ

 
కాగా, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ది కేరళ స్టోరీ సినిమా అసలైన పాన్ ఇండియా మూవీ అని తెలిపారు. ఎందుకంటే..  ఈ సినిమాలో తమిళ, మలయాళ అమ్మాయిలు ప్రధాన పాత్ర లో నటించారు. గుజరాత్ కు చెందిన నిర్మాత నిర్మించాడు.  బెంగాళీ వ్యక్తి ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు.
 
ఈ సినిమా అన్ని భాషల కలయికగా రూపొందినది కాబట్టి ఇది అసలైన పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా వర్మ పేర్కొన్నారు. నిజమైన పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని కూడా వర్మ వ్యక్తం చేశారు.