1988 నుంచి 42 మంది ఎంపీలపై అనర్హత వేటు

ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ పీపీ, బీఎస్పీ నేత అఫ్జల్ అన్సారీ ఇటీవలి కాలంలో అనర్హత వేటుకు గురై తమ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 పై మరోసారి చర్చ మొదలైంది.

చట్టం ఆధారంగా 1988 నుంచి ఇప్పటి వరకు 42 మంది ఎంపీలు అనర్హులయ్యారు. ఈ చట్టం కింద అత్యధికంగా 14వ లోక్‌సభలో 19 మంది ఎంపీలపై అనర్హత వేటు పడింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు వసూలు చేయడం, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడడం వంటి కారణాలతో ఎంపీలు సభ్యత్వం కోల్పోయారు.

రాజకీయ తిరుగుబాటు సభ్యులు, రెండు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించిన కేసుల్లో దోషిగా తేలిన ఎంపీలపై అనర్హత వేటు వేయవచ్చని చట్టం చెబుతున్నది.  క్రిమినల్ కేసులో రెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించడంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలపై స్వయంచాలకంగా అనర్హత వేటు అమలవుతుందని చట్టం పేర్కొంటుంది.

అయితే, లోక్‌సభకు లక్షద్వీప్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ ఫైజల్‌పై అనర్హత వేటుపడగా.. కోర్టు స్టే విధించింది. దాంతో ఆయనపై విధించిన అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్‌ ఉపసంహరించుకుంది.చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 1985లో లోక్‌సభ సభ్యుడిపై తొలి అనర్హత వేటు పడింది.

లాల్దుహోమా అనే కాంగ్రెస్ సభ్యుడు మిజో నేషనల్ యూనియన్ స్థాపించిన పార్టీ అభ్యర్థిగా మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దాంతో ఆయన అనర్హత వేటుపడింది. 9వ లోక్‌సభలో అప్పటి జనతాదళ్‌ నేత వీపీ సింగ్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది సభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు దారి తీసింది.

 ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం 14వ లోక్‌సభలో అత్యధికంగా 19 మంది ఎంపీలపై అనర్హత వేటుపడింది. ఆ సమయంలో లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో పది మంది ఎంపీలు సభ్యత్వాన్ని కోల్పోయారు. అదే సమయంలో యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో జూలై 2008లో జరిగిన విశ్వాస పరీక్షలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన తొమ్మిది మంది ఎంపీలు సభ్యత్వం కోల్పోయారు.

ఆ తర్వాత అమెరికాతో భారత్‌ అణు ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించాయి. ప్రశ్నలు అడిగినందుకు డబ్బు తీసుకున్న వ్యవహారంలో బీఎస్పీకి చెందిన ఇద్దరు లోక్‌సభ ఎంపీలు, కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన ఒక్కో ఎంపీపై అనర్హత వేటు పడింది. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సైతం సభ్యత్వం కోల్పోయారు.

లోక్‌సభ మాజీ జాయింట్ సెక్రటరీ దేవేంద్ర సింగ్ అస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఆయా ఎంపీల బహిష్కరణను సుప్రీంకోర్టు సమర్థించింది. 10వ లోక్‌సభ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద నలుగురు ఎంపీలపై అనర్హత వేటు పడింది. ఈ ఎంపీల అనర్హత వేటువేయడాన్ని సైతం సుప్రీంకోర్టు సమర్థించింది.

ప్రజాప్రాతినిథ్య చట్టం కింద అనర్హతకు గురైన వారిలో ప్రముఖులు సైతం ఉన్నారు. వీరిలో ముఫ్తీ మహ్మద్ సయీద్ (1989), సత్యపాల్ మాలిక్ (1989), శరద్ యాదవ్ (2017), అలీ అన్వర్ (2017) ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబు సోరెన్(2001), సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ (2006)పై అనర్హత వేటుపడింది.

సోరెన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన జార్ఖండ్ ఏరియా అటానమస్ కౌన్సిల్  సభ్యుడు, జయా బచ్చన్ రాజ్యసభ సభ్యుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. ఇదిలా ఉండగా, జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్ పదవిని కలిగి ఉన్నందుకు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సైతం అనర్హత పిటిషన్ దాఖలైంది. అయితే, ఆమె లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా కేసు ముగిసిపోయింది.