మణిపూర్‌లో క్రమేపీ సాధారణ పరిస్థితులు

మణిపూర్‌లో క్రమేపీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు సైన్యం సున్నిత ప్రాంతాలలో పహారా కాస్తోంది. మరో వైపు ఘర్షణ కారులపై తగు పర్యవేక్షణకు డ్రోన్లు, హెలికాప్టర్లను రంగంలోకి దించారు. పరిస్థితి కొంత మేరకు సద్దు మణగడంతో ఆదివారం మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలలో కర్ఫూను సడలించారు. భారత ఆర్మీ, అసోం రైఫిల్స్.. ఇప్పటి వరకు 23వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. మిలటరీ బేస్‍లు, శిబిరాలకు తరలించాయి. ఈ

గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయి హింసాత్మక తెగల తగవులతో రగిలిన మణిపూర్ ఆదివారం కొంత మేర ప్రశాంతతను సంతరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. మరో వైపు తెలంగాణ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చిక్కుపడ్డ తమ రాష్ట్రాల ప్రజలను , విద్యార్థులను తరలించేందుకు రంగంలోకి దిగాయి. చాలారోజుల పాటు రోడ్లపైకి రాలేని స్థితిలో ఉన్న పౌరులు ఇప్పుడు ఆంక్షలు సడలించడంతో అత్యధిక సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు.

నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు దిగారు. ఔషధాలు రోజువారి అవసరాలను సమకూర్చుకునేందుకు రావడంతో పలు చోట్ల సందడి నెలకొంది. ఇంఫాల్‌లో ఉదయం పూట కర్ఫూ సడలించారు. పది గంటలకు ఈ సడలింపు ముగిసింది. ఆ తరువాత ఆర్మీ, అస్సామ్ రైఫిల్స్ దళాలు రంగంలోకి దిగి ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. మణిపుర్‌లో ఆర్మీ.. ఏరియల్ వ్యూ నిర్వహిస్తోంది. హెలికాప్టర్లు, డ్రోన్లతో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తోంది. ఇంపాల్ లోయపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఘర్షణాయుత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు 120 నుంచి 125 వరకూ సైనిక దళాలు తరలిరావడం, దాదాపుగా పదివేల మంది సైనికులు, పారామిలిటరీ , సిఆర్‌పిఎఫ్ జవాన్లతో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవడంతో పరిస్థితి చక్కబడుతుందని అధికారులు తెలిపారు. ఘర్షణలు తలెల్తిన చురాచంద్‌పూర్‌లో కూడా ఉదయం ఏడు నుంచి కొద్ది సేపు కర్ఫూ సడలించారు.

అన్ని ప్రాంతాల్లో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకునేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శాంతి కమిటీలను మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ నియమించారు. “ఆర్మీ, అసోం రైఫిల్స్ దళాలు గత 96 గంటలుగా సహాయక చర్యలు చేస్తున్నాయి. హింసాత్మక ఘటనలు జరగకుండా చేయటంతో పాటు సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలను సంరక్షిస్తున్నాయి. ఫ్లాగ్ మార్చ్ తర్వాత నేటి ఉదయం 7 నుంచి 10 వరకు చురాచాంద్‍పూర్‌లో కర్ఫ్యూ సడలింపు జరిగింది” అని ఆర్మీ పేర్కొంది.

ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో 55 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. ఆస్తినష్టం కూడా భారీగానే జరిగింది. మణిపుర్‌లో చిక్కుకున్న తమ వారిని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తరలిస్తున్నాయి. మణిపుర్‌లో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి.