ఓఆర్ఆర్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం నయా దోపిడీ

ఓఆర్ఆర్ పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం నయా కుంభకోణానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ని 30 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

ఓఆర్ఆర్ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు  కట్టబెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తోందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. హెచ్ఎండీఏకు టోల్ ద్వారా 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతూ లీజ్ కు ముందే ఏ కంపెనీకి టెండరు రావాలో సీఎం కేసీఆర్ ముందే నిర్ణయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియను పూర్తిగా ఆడిట్ చేయిస్తారా? సీబీఐ దర్యాప్తునకు అంగీకరిస్తారా? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టలేదని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తుంటే సీబీఐ దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నారా?  అంటూ సవాల్ చేశారు. 

ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పే బీఆర్ఎస్ ఓఆర్ఆర్ ను ఎందుకు లీజ్ కు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎన్ హెచ్ ఏఐ నిబంధనల ప్రకారమే లీజు ప్రక్రియ జరిగిందని బీఆర్ఎస్ చెప్పడం అవాస్తవమని ధ్వజమెత్తారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని గుర్తు చేశారు.

బంగారు బాతు లాంటి ఓఆర్ఆర్ ను కేసీఆర్ చంపేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్ కుటుంబం ఆరితేరింది మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిని అంచనా వేసి 10 శాతం వృద్ధి లెక్కకట్టినా ఓఆర్ఆర్ ద్వారా రూ. 75 వేల కోట్లు వస్తుందని చెప్పారు. మరి గుణాత్మకమైన మార్పును తెస్తామన్న కేసీఆర్ సర్కార్  ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటో చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.
 
హైదరాబాద్ లో కోట్ల విలువ చేసే భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓఆర్ఆర్, హైదరాబాద్ భూములపై విచారణ చేయిస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.