పాక్ కు రహస్యాలు అందజేస్తూ డిఆర్డిఓ కీలక శాస్త్రవేత్త అరెస్ట్

దాయాది దేశం పాకిస్థాన్‌ కు భారత రహస్య సమాచారం అందించిన ఓ శాస్త్రవేత్త తాజాగా అరెస్ట్‌ అయ్యారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (లో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్త వాట్సాప్‌ వీడియో కాల్స్‌ ద్వారా భారత్‌ కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌ ఏజెంట్‌ కు అందజేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

 ఈ మేరకు సదరు శాస్త్రవేత్తను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్  గురువారం అరెస్టు చేసింది.  ఆ శాస్త్రవేత్త పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌ ఏజెంట్‌ పన్నిన వలపు వలలో (హనీ ట్రాప్‌) చిక్కినట్లు ఏటీఎస్‌  అధికారులు తెలిపారు. వారితో నిరంతరం టచ్‌లో ఉంటూ భారత్‌కు సంబంధించిన సీక్రెట్‌ సమాచారాన్ని అందించినట్లు వెల్లడించారు.

‘తన వద్ద ఉన్న దేశానికి సంబంధించిన రహస్య సమాచారం శత్రువులకు చేరితే దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని తెలిసినా.. ఆ శాస్త్రవేత్త అధికార దుర్వినియోగానికి పాల్పడి శత్రు దేశానికి వివరాలు అందించాడు’ అని ఏటీఎస్ తన ప్రకటనలో పేర్కొంది.

నిందితుడిని పూణేలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కి చెందిన రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్లు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న పీఎం కురుల్కర్‌గా గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇది హనీట్రాప్ కేసుగా ప్రాథమికంగా తెలుస్తోంది. పదవీ విరమణకు ఆరు నెలల దూరంలో ఉన్న సమయంలో కురుల్కర్ హనీట్రాప్‌కు గురయ్యాడు.

గత ఆరు నెలలుగా అతడు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం ఉన్న ఓ మహిళతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. అతను వాయిస్ సందేశాలు, వీడియో కాల్స్ ద్వారా పాకిస్తాన్ ఆధారిత కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతూ వారితో కొన్ని సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.

“శత్రువు దేశం స్వాధీనం చేసుకున్న అధికారుల రహస్యాలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని తెలిసినప్పటికీ, శాస్త్రవేత్త తన స్థానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా, శత్రు దేశానికి వివరాలను అందించాడు” అని  ఏటీఎస్‌ ప్రకటన తెలిపింది. అధికార రహస్యాల చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద సదరు శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏటీఎస్‌ తెలిపింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే దానిపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.