రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన  శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.  కార్యకర్తల డిమాండ్ మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించారు. తాను కార్యకర్తల మనోభావాలను అగౌరవపరచలేనని, వారి  ప్రేమ కారణంగా తన  రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లుగా పవార్ తెలిపారు.  

భవిష్యత్తులో తాను పార్టీలో సంస్థాగత మార్పులు, కొత్త బాధ్యతలు అప్పగించడం, కొత్త నాయకత్వాన్ని సృష్టించడంపై దృష్టి సారిస్తానని పవార్  తెలిపారు. పార్టీ అభివృద్ధి,  సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు, నేతలకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని పవార్ పేర్కొన్నారు.

అంతకు ముందు, శ‌ర‌ద్ ప‌వార్ త‌న ప‌ద‌వికి ఇచ్చిన  రాజీనామాను ఆ పార్టీకి చెందిన నేత‌లు ఏక‌గ్రీవంగా వ్య‌తిరేకించారు. శ‌ర‌ద్ ప‌వారే త‌మ పార్టీ అధ్యక్షునిగా కొన‌సాగాల‌ని ఎన్సీపీ ప్యానెల్ డిమాండ్ చేసింది. 1999లో శ‌ర‌ద్ ప‌వార్ ఎన్సీపీ పార్టీని స్థాపించారు.  అయితే 82 ఏళ్ల‌కు చెందిన ప‌వ‌ర్ త‌న పార్టీ హోదా నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ఇటీవ‌ల స్ప‌ష్టం చేశారు.
ఈ నేప‌థ్యంలో ఇవాళ ముంబైలోని పార్టీ ఆఫీసులో సమావేశం జరిగింది. శ‌ర‌ద్ ప‌వార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ ప‌వార్‌లు ఆ సమావేశంకు హాజ‌ర‌య్యారు.  శుక్రవారం నాడిక్కడ సమావేశమైన ప్రత్యేక కమిటీ రెండు తీర్మానాలను ఆమోదించింది. పవార్ ఆజీనామాను తిరస్కరించడం, పార్టీ అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగాలని అర్ధించడం వంటి రెండు తీర్మానాలను ఆమోదించిన కమిటీ దీనిపై తుది నిర్ణయం పవార్‌కే వదిలివేయాలని నిర్ణయించింది.
 
అనంతరం పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మే 2న శరద్ పవార్ ప్రకటించారని, తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పార్టీలోని కీలక నేతలతో కూడిన ఒక కమిటీని ఆయన ఏర్పాటు చేశారని తెలిపారు. పవార్ రాజీనామా ప్రకటనతో తామంతా షాక్ కు గురయ్యామని, ఆయన నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని తాము ఊహించలేదని చెప్పారు.
 
 తనతో పాటు పలువురు నేతలు శరద్ పవార్ ను కలిసి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరామని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకే కాకుండా, దేశానికి కూడా మీ అవసరం ఉందని చెప్పామని ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ప్ర‌స్తుతం ఎన్సీపీ అధ్యక్షునిగా శ‌ర‌ద్ ప‌వారే కొన‌సాగుతార‌ని ప్ర‌ఫుల్ ప‌టేల్ భరోసా వ్యక్తం చేశారు.
ఇవాళ జ‌రిగిన మీటింగ్‌లో ఏక‌గ్రీవ తీర్మానం పాస్ చేశారు. ఎన్సీపీ జాతీయ అధ్య‌క్షుడిగా శ‌ర‌ద్ ప‌వార్ కొన‌సాగాల‌ని ఆ తీర్మానంలో కోరారు. అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డాన్ని పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ప్ర‌ఫుల్ ప‌టేల్ వెల్ల‌డించారు. శ‌ర‌ద్ ప‌వారే పార్టీ అధ్యక్షునిగా కొన‌సాగాల‌ని కోరుతున్నామ‌ని చెబుతూ ల‌క్ష‌ల మంది మ‌నోభావాల‌ను గౌర‌వించాల‌ని, అధ్య‌క్షుడిగా ఆయ‌నే కొన‌సాగాల‌ని కోరారు.

ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగడంపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని శరద్‌ పవార్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే, అధ్యక్షుడిగా పవార్‌ను కొనసాగిస్తూ, కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని తీసుకురావాలని పార్టీలోని కీలక నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకొస్ ఆ బాధ్యతలను పవార్‌ కుమార్తె సుప్రియా సూలే అప్పగిస్తారని, అది సాధ్యం కాకపోతే, అజిత్ పవార్‌కు అప్పగిస్తారనే భావిస్తున్నారు.