కేరళలో ఉగ్రవాద కుట్రను బయటపెట్టిన `ది కేరళ ఫైల్స్’

కేరళలో జరుగుతున్న ఉగ్రవాద కుట్ర  సత్యాన్ని   `ది కేరళ ఫైల్స్’ సినిమాలో బయటపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బళ్లారిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన మొదటిసారిగా ఈ సినిమా గురించి వ్యాఖ్యానించారు. సినిమా కేవలం కేరళ కథనే కాదు ..మొత్తం భారతదేశానికి వ్యతిరేకంగా సాగుతోన్న భారీ స్థాయి కుట్రను తెలిపిన కథ అని చెప్పారు.

తీవ్రవాదానికి సంబంధించిన చేదునిజాన్ని ఈ చిత్రంలో బాగా చూపారని తెలిపారు. ఈ సినిమాలో నిజాలు చూపారని చెబుతూ  భారతీయ సంస్కృతిని, ప్రగతిని అడ్డుకునే విద్వేషశక్తుల తీరును సినిమాతో ఎండగట్టారని కొనియాడారు. అయితే ఈ సినిమా ప్రదర్శనకు నోచుకోకుండా చూస్తోన్న కాంగ్రెస్ ఏకంగా ఉగ్రవాదం పట్ల మోకరిల్లిందని, తన ఓటు బ్యాంకులను రక్షించుకునేందుకు చివరికి దేశ ప్రయోజనాలను దెబ్బతీసే శక్తులకు కూడా వత్తాసు పలికిందని మోదీ ధ్వజమెత్తారు.

ఉగ్రవాదం, సంబంధిత శక్తి పలు రూపాలలోకి విస్తరించుకుని పోతోందని పేర్కొంటూ ఉగ్రవాదం అంటే ఇంతవరకూ విధ్వంసకర చర్యల దిశగా ఉండేదని, ఆయుధాలు మందుపాతరల క్రమం సంతరించుకునేదని తెలిపారు. అయితే ఇప్పుడు భారతీయ సమాజాన్ని బయటి నుంచి లోపలి నుంచి మరింతగా శక్తిహీనం చేసేందుకు పలు రూపాలను ఎంచుకొంటోందని ప్రధాని హెచ్చరించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉగ్రవాదులతో కలిసి కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతుందని ఆరోపించారు. వారికి అండగా ఉంటూ తెరవెనుక రాజకీయలు చేస్తోందని  మండిపడ్డారు.  తీవ్రవాదం, ఉగ్రవాద ధోరణులపై తీసిన ది కేరళ ఫైల్స్ సినిమాను  కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని ప్రధాని ధ్వజమెత్తారు.   మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను కాపాడగలదా? అని ప్రశ్నించారు.

కర్ణాటకను  నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు భద్రతా వ్యవస్థ, శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమైనవని మోదీ చెప్పారు.   దశాభ్దాలుగా ఉగ్రవాదులు వలన సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అయినా ఉగ్రవాదులు ఏదో ఒకరకంగా రెచ్చిపోతూనే ఉన్నారని ప్రధాని తెలిపారు. అయితే,  ఉగ్రవాదంపై బీజేపీ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తోందని  మోదీ   స్పష్టం చేశారు.  

కాంగ్రెస్ గెలుపు కోసం తప్పుడు కథనాలు, సర్వేలు చేస్తుందని,  రాష్ట్రంలోని ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని ప్రధాని  విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా బుజ్జగింపుల గురించి, నిషేధాల గురించి ఉందని ఎద్దేవా చేశారు.  యడ్యూరప్ప, బొమ్మై నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మూడున్నరేళ్లు మాత్రమే ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని ప్రధాని తెలిపారు.

మరోసారి బీజేపీకి కన్నడ ప్రజలు అధికారం ఇవ్వాలని కోరుతూ  కర్ణాటకను  దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తామని  ఈ సందర్భంగా మోదీ  హామీ ఇచ్చారు.    గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి బదులు అవినీతికి ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధాని ఆరోపించారు.   స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయాలతో పాటు వ్యవస్థలను భ్రష్టు పట్టించేందుకు కాంగ్రెస్ కృషి చేసిందని ఆయన దుయ్యబట్టారు.