ఉత్తరప్రదేశ్‌ లో మరో గ్యాంగ్‌స్టర్‌ కాల్చివేత

ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ లో కాల్చివేశారు. మీరట్‌కు చెందిన స్టేట్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానాను ఎన్ కౌంటర్ చేశారు. మీరట్ శివార్లల్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో అనిల్ దుజానా మరణించినట్లు ఉత్తర ప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.

ఈ ఘటనతో మీరట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా మీరట్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానాపై వివిధ పోలీస్ స్టేషన్లలో 62 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో 18 హత్య కేసులు ఉన్నాయి.

అతను నోయిడా, ఘజియాబాద్‌ ప్రాంతాలతోపాటు, ఇతర ప్రాంతాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. దోపిడీలు, దొంగతనాలు, భూ కబ్జాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఇందుకోసం ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో పలు చోటల్ ముఠాలను ఏర్పాటు చేసుకున్నాడు. హత్యకేసులో జైల్లో ఉన్న అనీల్‌ 2012 నుంచి జైల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో 2021లో అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.

అతను జైలు నుంచి బయటకు రాగానే తనపై నమోదైన హత్యకేసులోని కీలక సాక్షులను బెదిరించాడని, చివరికి ఆ సాక్షలను చంపేందుకు నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. హత్య కేసులోని కీలక సాక్షులను చంపేందుకు అనీల్‌ ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న పోలీస్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది.

దీంతో అనీల్‌, తన గ్యాంగ్‌స్టర్‌ బృందం మీరట్‌లోని ఓ గ్రామంలోని ఎత్తైన పొదల మధ్య దాక్కున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారి సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని సమీపిస్తున్న సమయంలో పొదల చాటున దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌ బృందం పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందంపై కాల్పులు జరిపింది.

దీంతో వెంటనే అప్రమత్తమై పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం గ్యాంగ్‌స్టర్‌ బృందంపై ఎదురుకాల్పులు జరిపింది. పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అనీల్‌ దుజానా మృతి చెందాడు. గత ఏడాది డిసెంబర్ లో ఢిల్లీలో పోలీసులు అనిల్ దుజానాను అరెస్ట్ చేశారు.

మయూర్ విహార్ ప్రాంతంలో సెటిల్ మెంట్ కోసం వచ్చిన అనిల్ దుజానాను పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎస్టీఎఫ్ పోలీసులు దుజానాను ఎన్ కౌంటర్ చేశారు.  గతంలో సమాజ్ వాది ప్రభుత్వం గ్యాంగ్ స్టర్లను పెంచి పోషించిందని, తమ హయంలో వారందరూ ప్రాణభిక్ష పెట్టాలంటూ వేడుకుంటున్నారని ఈ మధ్యే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

ఈ మధ్యే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాది పార్టీ మాజీ లోక్‌సభ సభ్యుడు అతిక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. దానికి కొద్ది రోజుల ముందే అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో గ్యాంగ్‌స్టర్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

2017 ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 183 మంది గ్యాంగ్‌స్టర్‌లు మృతి చెందినట్లు గత నెల్లో యుపి పోలీసులు తెలిపారు. అయితే ఆదే సమయంలో 13 మంది పోలీసులు మృతి చెందారు.  యూపీలో పురపాలక ఎన్నికలు జరుగుతున్న వేళ గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా ఎన్‌కౌంటర్ జరగడం ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపరిచేందుకే తాము క్రిమినల్స్ అంతుచూస్తున్నామని యూపీ పోలీసులు చెబుతున్నారు.