రాత్రికి రాత్రే గుంటూరులో ఫాతిమా నగర్ గా ఏటీ అగ్రహారం

వంద సంవత్సరాలకు పైగా చరిత్ర గల గుంటూరులోని ఎటి అగ్రహారం పేరును అర్ధాంతరంగా ప్రభుత్వం మార్చడం పట్ల నిరసన వ్యక్తం అవుతున్నది. గుంటూరు పట్టణంగా అభివృద్ధి చెందక ముందే నడిబొడ్డున త్రిదండి అగ్రహారం (ఎటి అగ్రహారం) వెలిసింది. అయితే పట్టణం అభివృద్ధి చెందేకొలది ఇది ఒక పక్కకు మారింది.
 
ఈ అగ్రహారం వేగంగా అభివృద్ధి చెందింది. 21 వీధులతో ఉన్న ఈ అగ్రహారం నగరంలో జనసంఖ్య ఎక్కువగా ఉన్న కానీలలో ఒకటి. ఇక్కడ నివసించేవారిలో 95 శాతం మంది హిందువులే. కేవలం 5 శాతం మంది ఇతరులు ఉంటుంటారు.
 
ప్రస్తుతం కొందరు ప్రభుత్వం అండతో రాత్రికి రాత్రే కాలనీల పేర్లు మార్చేస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మత దురహంకారంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాధనంతో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి మరీ నిధులు మంజూరు చేసి, కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గుంటూరులోని ఏటీ అగ్రహారం పేరును కూడా ఇలాగే మార్చాశారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రాత్రికి రాత్రే గుంటూరులో ఏటీ అగ్రహారం పేరు ఫాతిమాపురంగా ఎలా మారిందని నిలదీశారు. పేరు మార్పుపై గుంటూరు కార్పొరేషన్లో తీర్మానం చేశారని అంటున్నారు. అసలు ఆ పేరు మార్చాలని తీర్మానం చేయడమేంటి..? అగ్రహారం అనే పేరుని ఎందుకు వద్దనుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
“పాకిస్థాన్ జాతిపిత పేరు మనకెందుకంటే కేసులు పెడతారు. జిన్నా టవర్ పేరు మార్చండంటే జాతీయ జెండా రంగులేసి రాజకీయం చేస్తారు. వైసీపీ పరిపాలన అంటే హిందువులను అవమానించి ఇతర వర్గాలను సంతృప్తి పరచడం అన్నట్టుగానే సాగుతోంది… ఇది సిగ్గుచేటు. ఇలాంటి రాజకీయాలు చేస్తే హిందూ సమాజం ఏదీ ఉంచుకోదు… తిరిగిచ్చేస్తుందని గుర్తుంచుకోవాలి” అని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
 
ఇప్పటికైనా ఏటీ అగ్రహారం పేరును అలాగే ఉంచి, జిన్నా టవర్ పేరును తక్షణమే మార్చాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. లేకపోతే బీజేపీ నేతృత్వంలో హిందూ సమాజం మొత్తం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉందని విష్ణు హెచ్చరించారు.
 
పేరు మార్చడం పట్ల స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు దిద్దుబాటు చర్యలకు పాల్పడిన్నట్లున్నది. పక్కనే ఉన్న ప్రాంతంలో ఉంచవలసిన `ఫాతిమా నగర్’ పేరుగల బోర్డును పొరపాటున ఇక్కడ పెట్టిన్నట్లున్నారని అంటూ మునిసిపల్ కమీషనర్ చెరుకూరి కీర్తి ఆగ్రహంగా ఉన్న స్థానికులను శాంతిపచేసే ప్రయత్నం చేశారు.
 
అయితే కుట్రపూరితంగా ఈ బోర్డు పెట్టిన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ముందుగా బోర్డును పెట్టి, ఆ తర్వాత అధికారులు సర్వే సమయంలో రికార్డులలో చేర్చేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.