కర్నాటకలో విహెచ్‌పి, బజరంగ్ దళ్ నిరసన!

కర్నాటకలో అధికారంలోకి వస్తే మాత్రం బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి), బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. కొన్ని ప్రదేశాలలో అయితే వారు ‘హనుమాన్ చాలీసా’ కూడా పఠించారు.

బెంగళూరు, చిక్కబల్లాపురా, శ్రీరంగపట్న, మాండ్య, చిక్కమంగళూరు తదితర ప్రదేశాలలో నిరసనలు చేపట్టినట్లు విహెచ్‌పి వర్గాలు పేర్కొన్నాయి. ఇక శ్రీరంగపట్నలో అయితే బజరంగ్ దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ మేనిఫెస్టోను చింపడమే కాకుండా, దానిని చెప్పులతో కొట్టారు.  విహెచ్‌పితో సంబంధం ఉన్న బజరంగ్ దళ్ నాయకులు, హిందూ ధార్మిక నాయకులు ప్రజలకు ఓ వీడియో సందేశం ద్వారా గురువారం సాయంత్రం ‘హనుమాన్ చాలీసా’ పఠించేందుకు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హనుమాన్ మందిరానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

వివిధ సముదాయాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వ్యక్తులపై,సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ ‘ మేము చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతాము, దానిని ఉల్లంఘించే బజరంగ్ దళ్, పిఎఫ్‌ఐ లేక ఇతర సంస్థలు ఏవైనా సరే సామాజిక సముదాయాల మధ్య చిచ్చు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి సంస్థలను నిషేధిస్తాం’ అని  స్పష్టం చేసింది.

మాటమార్చిన కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బజరంగ్‌దళ్‌ అంశం ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కాంగ్రెస్ మాటమార్చింది. అసలు తాము బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని అననేలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. తాను కర్ణాటకలో న్యాయమంత్రిగా కూడా పనిచేశానని ఆయన గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బజరంగ్‌దళ్‌‌ను నిషేధింపలేదని తేల్చి చెప్పారు.

బజరంగ్‌దళ్‌‌ను నిషేధిస్తామని జరుగుతున్న ప్రచారంపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సవివరంగా మాట్లాడతారని కూడా మొయిలీ చెప్పారు. మరోవంక, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయమై సూటిగా స్పందించేందుకు నిరాకరించారు. ”డాక్టర్ పరమేశ్వర ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఆయన మేనిఫెస్టో ముసాయిదా కమిటీ చైర్మన్.  ఒకసారి మా పార్టీ వ్యక్తులు సమాధానం ఇచ్చిన తర్వాత నా సొంత అభిప్రాయం చెప్పాల్సిన పనిలేదు” అని ఖర్గే పేర్కొన్నారు.

హనుమాన్ భక్తులు బలంగా నిలబడితే ఇప్పటికే అస్థిరమైన కాంగ్రెస్‌ను కూలదోస్తారంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలపై అడిగినప్పుడు, ఆయన (బొమ్మై) చెప్పేది ఆయన చెబుతారని, బొమ్మై ప్రతి ప్రశ్నకు తాము సమాధానం ఇవ్వాల్సిన పని లేదని ఖర్గే దాటవేశారు.