మ‌ణిపూర్‌లో భారీ హింస‌.. రంగంలోకి దిగిన సైన్యం

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడుకుతోంది. మణిపూర్‌లో గిరిజనుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. గిరిజన వర్గాల నిరసనతో బుధవారం ఆ రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలు జరిగాయి. చురాచాంద్‍పూర్, ఇంపాల్, కంగ్‍పోక్పీ జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో 8 జిల్లాల్లో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
 
రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మ‌ణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌తో అక్క‌డ ప‌రిస్థితి గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చ‌ర్చించారు. శాంతిభద్రతల పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అడిగి తెలుసుకున్నారు.
 
గిరిజనేతర మైటీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని గిరిజన సంఘాలు నిరసనలకు దిగాయి. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టడంతో ఈ ఘర్షణలను కట్టడి చేసేందుకు మణిపూర్‌ ప్రభుత్వం సైన్యంను, అస్సాం రైఫిల్‌ బలగాలను రంగంలోకి దింపింది.
 
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సైన్యం, అస్సాం రైఫిల్స్‌ గురువారం ఫ్లాగ్‌ మార్చ్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ “నా రాష్ట్రం మణిపూర్ తగలబడిపోతుంది. దయచేసి సాయం చేయండి” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్‍లకు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.
గిరిజనేతర మైటీలను ఎస్టీ కమ్యూనిటీలో చేర్చవద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ ఆధ్వరంలో చురాచాంద్‍పూర్ జిల్లాల్లో బుధవారం నిర్వహించిన గిరిజన సంఘీభావ ర్యాలీలో ఘర్షణలు మొదలయ్యాయి. వేలాది మంది ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు పక్క జిల్లాలకు కూడా పాకాయి. వేరే ప్రాంతాల్లోనూ అల్లర్లు జరిగాయి. బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ ప్రసంగించాల్సిన వేదికను కూడా నిరసనకారులు ఆగ్రహంతో ధ్వంసం చేశారు.

రాజధాని ఇంఫాల్‌, చురాచాంద్‌పుర్‌, కాంగ్‌పోక్పిలో ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో కర్ఫ్యూ విధించారు. దీంతో ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. ఈ ఘర్షణల వల్ల శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అస్సాం రైఫిల్స్‌ బలగాలు, ఆర్మీ 7,500 మంది పౌరులను ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాలకు తరలించి వారికి అక్కడ ఆశ్రయం కల్పించారు.

ఇంపాల్ వెస్ట్, చురచాంద్‍పూర్, కంగ్‍పోక్పీ, కక్చింగ్, తౌంబల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిలాల్లో ఘర్షణలు జరిగాయి. గిరిజనేతర ప్రాబల్యమున్న ప్రాంతాల్లోనూ ఆందోళన జరిగాయి. ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రం ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు మణిపూర్ ప్రభుత్వం తెలిపింది. అయితే, బ్రాడ్‍బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటాయి.

మణిపూర్‌లో 53 శాతం మైటీ కమ్యూనిటీకి చెందినవారే నివశిస్తున్నారు.  దీంతో ఆ తెగ అక్కడ ప్రధాన వర్గంగా ఉంది. బెంగాలి మాట్లాడే మైతీ తెగ ప్రజలు ప్రధానంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మయన్మార్,బంగ్లాదేశ్‌నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా అక్కడి ప్రజలు మణిపూర్ రాష్ట్రంలోకి వలస వస్తున్నారు.  వీరివల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మైతీలు వాదిస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

వీరికి ఇంఫాల్ లోయలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. స్థానికంగా ఎస్టీ హోదా అనుభవిస్తున్న గిరిజనులు ఆచార వ్యవహారాల్లో ఎక్కువగా క్రైస్తవ మతం ఆచరిస్తుంటారు. మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వటంపై మొదటి నుంచి గిరిజన తెగలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.