ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా

భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఒక భారతీయ అమెరికన్‌, సిక్కు అమెరికన్‌ ప్రపంచ బ్యాంక్‌కు సారథ్యం వహించడం చరిత్రలో ఇదే ప్రథమం.  వచ్చే నెల 2వ తేదీన బంగా ప్రపంచ బ్యాంక్‌ సారథిగా పగ్గాలు చేపడతారు. అప్పటి నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు.
 అంతర్జాతీయ ఆర్థిక ద్రవ్యవ్యవహారాలలో కీలక నిర్ధేశిత సూచికగా నిలిచే ప్రపంచ బ్యాంక్‌కు చెందిన 25 సభ్యదేశాలతో కూడిన కార్యనిర్వాహక మండలి సమావేశంలో బంగాను ఏకగ్రీవంగా ఈ  అత్యున్నత పదవికి ఎంపిక చేశారు.  చరిత్రలో అత్యంత కీలకమైన ఈ సమయంలో ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవి చేపట్టడానికి అర్హుడుగా భావించిన బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవికి ఫిబ్రవరిలోనే నామినేట్‌ చేశారు. సాంప్రదాయికంగా ప్రపంచ బ్యాంక్‌ సారథ్యం అమెరికన్లకే దక్కుతోంది.
 
తమ తరఫున ఆ పదవికి బంగా పేరును ప్రతిపాదించనున్నట్టు బైడెన్‌ ఫిబ్రవరిలోనే ప్రకటించారు. గతంలో మాస్టర్‌ కార్డ్‌ ఇంక్‌ చీఫ్‌గా వ్యవహరించిన బంగా ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు.  భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న 300 పైగా పెద్ద అంతర్జాతీయ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే యూఎస్‌–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) చైర్మన్‌గాను, ఇంటర్నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌గాను కూడా బంగా పని చేశారు.
 
మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన బంగా పాఠశాల విద్యను సిమ్లాతో పాటు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌)లో అభ్యసించారు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టాను అందుకున్న బంగా.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.
 
 నెస్లే ఇండియాతో కెరీర్‌ను ప్రారంభించిన బంగా ఆ తర్వాత భారత్‌, మలేషియాల్లో సిటీ బ్యాంక్‌లో పనిచేశారు. అనంతరం 1996లో అమెరికాకు వెళ్లి పెప్సీకోలో 13 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 2009లో మాస్టర్‌కార్డ్‌ ప్రెసిడెంట్‌, సీఓఓగా బాధ్యతలు చేపట్టారు. పారిశ్రామిక రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా బంగా పలు అవార్డులను అందుకున్నారు. భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఆయన  ప్రస్తుతం అమెరికా – భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న జాతీయ అమెరికా – చైనా సంబంధాల కమిటీ సభ్యునిగా, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ ఎమెరిటస్ గా వ్యవహరిస్తున్నారు. కాగా 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. ఈ వ‌ర‌ల్డ్‌ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఉన్న ఇండియన్స్ సేవ‌లందిస్తున్నారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా అన్షులా కాంత్‌, చీఫ్‌ ఎకానమిస్ట్‌గా ఇందర్‌మిత్‌ గిల్‌, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌గా లక్ష్మీ శ్యామ్‌ సుందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పరమేశ్వరన్‌ అయ్యర్ కొన‌సాగుతున్నారు.