సిబిఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా అవినాష్ సమాధానాలు!

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ప్రశ్నించాలని సిబిఐ స్పష్టం చేసింది. ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో  వివేకా కేసులో అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తునకు సహకరించట్లేదని తెలిపింది.
 
 సీబీఐ అడుగుతున్న ప్రశ్నలకు అవినాష్ రెడ్డి వాస్తవాలు చెప్పడంలేదని, దురుద్దేశపూరితంగా దర్యాప్తునకు సహకరించట్లేదని ఆరోపించింది. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా అవినాష్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నారని పేర్కొంది. అవినాష్ రెడ్డి దర్యాప్తు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్లు హైకోర్టుకు సీబీఐ వెల్లడించింది.
‘‘ఏపీ సీఎం జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉంది. రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే వివేకాను హత్య చేశారు’’ అని సీబీఐ పునరుద్ఘాటించింది. వివేకా హత్యను విస్తృత కుట్ర కోణంలో చూడాలని సీబీఐ పేర్కొంది. ‘‘హత్యకు కుట్రచేయడం, అమలు చేయడం, సాక్ష్యాలు లేకుండా క్లీనింగ్‌ ప్రక్రియ చేపట్టడం విస్తృత కుట్రలో భాగంగానే జరిగాయి. దీనికి అనేకమంది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. హత్య కుట్రలో అవినాశ్‌రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిపై దర్యాప్తు జరగాలి. అందువల్ల ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదు’’ అని సీబీఐ పేర్కొన్నది.
 
ఈ కేసులో అవినాష్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ముందుకు రావట్లేదని తెలిపింది. ఆయన అనుచరుల వల్ల దర్యాప్తునకు ఆటంకం కలిగిందని పేర్కొంది. అవినాష్ అనుచరులు సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని పిటిషన్ లో వెల్లడించింది.  అవినాష్‌ పై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని స్పష్టం చేసిన సీబీఐ ఆయన నేరచరిత్రను ప్రస్తావించింది.
ఆయన అనుచరులు సాక్షులను ప్రభావితం చేసినట్టు సీబీఐ దృష్టికి వచ్చిందని పేర్కొంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య మరికొంతమంది ప్రభావితమైనట్టు తెలిసిందని సీబీఐ ప్రస్తావించింది. వివేకా హత్య అనంతరం సాక్ష్యాలు చెరిపేయడంలో అవినాష్ పాత్ర ఉందని సీబీఐ కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది. హత్య జరిగిన రోజు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంటికి ఎందుకెళ్లారో తెలియాల్సి ఉందని తెలిపింది.
ఈ హత్య కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? తెలుసుకోవాలని పేర్కొంది. మార్చి 15న అవినాష్‌రెడ్డి ఎక్కడ ఉన్నారో నిర్ధారించాల్సి ఉందని వెల్లడించింది. అవినాష్ తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్టు అనంతరం ర్యాలీలు చేయడం సాక్షులను ప్రభావితం చేయడమేనని సీబీఐ అభియోగించింది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలు లేవని తెలిపింది.

వివేకా రాసిన లేఖను దాచటంలో దురుద్దేశం లేదని పేర్కొంది. తాము వచ్చే వరకు లేఖను దాచాలని వివేకానంద పీఏకు రాజశేఖర్‌ చెప్పారుని, సునీత, రాజశేఖర్‌ రాగానే ఎస్పీ సమక్షంలో లేఖను పోలీసులకు అందించారని స్పష్టం చేసింది. షమీమ్‌తో పెళ్లికి వివేకా హత్యకు సంబంధం లేదని సీబీఐ పేర్కొంది.