పుతిన్ హత్యకు ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి!

 
శత్రు దుర్బేధ్యంగా ఉండే రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసంపై డ్రోన్ల దాడి జరపడం ద్వారా తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర పన్నిందని రష్యా ఆరోపించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే, ఆ డ్రోన్లను తాము కూల్చివేశామని చెబుతూ దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా హెచ్చరించింది.
 
దాడి సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరని, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిపింది. మాస్కోలో అనధికారిక డ్రోన్లు ఎగరడంపై నిషేధం విధించారు. ఈ నెల 9న విక్టరీ పరేడ్ యథాతథంగా కొనసాగుతుందని కూడా రష్యా ప్రకటించింది. అయితే ఏకంగా పుతిన్ కార్యాలయంపై డ్రోన్ దాడి జరగడం, ఆ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డై ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రసారం కావడంతో రష్యాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రాత్రి సమయంలో రెండు డ్రోన్‌లతో దాడి చేసి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపిస్తోంది ‘క్రెమ్లిన్‌ భవనంపై రెండు ఉక్రేనియన్ డ్రోన్‌లు రాత్రిపూట దాడి చేశాయి. రష్యా అధ్యక్ష నివాసం క్రెమ్లిన్‌‌లో ఎలాంటి భౌతిక నష్టం జరగకుండా  సైన్యం రెండు డ్రోన్‌లను కూల్చివేసింది’ అని రష్యా అధికారులు వెల్లడించారు. డ్రోన్ దాడి సమయంలో ఇద్దరు వ్యక్తులు అధ్యక్షభవనం పైనగల డోమ్ వైపు ఎక్కుతున్నట్లు వీడియోలో కనిపిస్తున్నా వారెవ్వరో గుర్తింపలేదు. అయితే రష్యా చేస్తున్న ఆరోపణలకు నిర్దుష్ట ఆధారాలను ఇంకా వెలువరింపలేదు.

రాడార్‌ వార్‌ ఫేర్‌ సిస్టమ్స్‌తో సైన్యం అప్రమత్తంగా వుండటంతో వీటి ప్రయత్నం ఫలించలేదని వెల్లడించింది. ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి ఉగ్రవాద దాడి అని, అధ్యక్షుడు పుతిన్‌ హత్యకు జరిగిన ప్రయత్నమని మాస్కో ఆరోపిస్తోంది.  క్రెమ్లిన్ కాంప్లెక్స్ భూభాగంలో డ్రోన్‌ల శకలాలు చెల్లాచెదురుగా ఉన్నాయని, ఎటువంటి ప్రాణనష్టం, భౌతిక నష్టం జరగలేదని రష్యా అధ్యక్ష పరిపాలన నుంచి ప్రకటన వచ్చింది.

డ్రోన్ దాడి జరిగిన సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరని, మాస్కో వెలుపల ఉన్న తన నోవో ఒగారియోవో నివాసంలో పనిచేస్తున్నారని వెల్లడించింది. మరోవైపు, రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు స్పందిస్తూ ఈ దాడితో తమకేం సంబంధం లేదని స్పష్టం చేశారు. రష్యా పెద్ద ఎత్తున తమపై దాడి చేసేందుకు యోచన చేస్తోందని, తాము ఎప్పుడూ రష్యన్ ఫెడరేషన్‌లోని ప్రదేశాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయలేదని ఉక్రెయిన్ తెలిపింది.

తమ దృష్టి అంతా తమపై జరుగుతున్న రష్యా దాడిని ఎదుర్కోవడంపైననే ఉన్నదని చెబుతూ పైగా పుతిన్ ని చంపినంతమాత్రం చేత తాము ఎదుర్కొంటున్న సైనిక దాడి సమస్య పరిష్కరం కాదని గుర్తు చేశారు. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి నెపంతో తమపై మరింత పెద్ద ఎత్తున దాడి చేసే కుట్ర అని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పటికే 14 నెలలుగా యుద్ధం జరుగుతోంది. వేలాది మంది చనిపోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర దేశాలకు వలసపోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.