6న బెంగుళూరులో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో

దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో తిరిగి గెలుపొందడం ద్వారా అధికార పార్టీ ఓటమి చెందుతూ వస్తున్న నాలుగు దశాబ్దాల ఆ రాష్ట్ర వరవడికి గండి పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న బిజెపి తుది ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతుంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ కేంద్ర నాయకత్వం సుడిగాలి పర్యటనలతో హెరెత్తిస్తున్నది.
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అలుపెరుగని రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రజాతీర్పును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈనెల 6వ తేదీ శనివారంనాడు ‘నభూతో నభవిష్యత్తి’ అనే రీతిలో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో జరుపబోతున్నారు.

కర్ణాటక ఎన్నికల ప్రకటనకు మూడు నెలల ముందు నుంచే తరచు రాష్ట్రంలో పర్యటిస్తూ వచ్చిన ప్రధాన మంత్రి, పలు కీలక నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం, రోడ్‌షోలు సాగించారు. చేతులో ఉన్న వ్యవధిని దృష్టిలో ఉంచుకుని మరో 20కి పైగా ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

దీనికి హైలైట్‌గా ఈనెల 6న బెంగళూరులో మెగా రోడ్‌షోకు సన్నాహాలు జరుగుతున్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 37 కిలోమీటర్ల మేరకు సాగే ఈ రోడ్‌షోలో 10 లక్షల మంది పాల్గొంటారని పార్టీ వర్గాల అంచనాగా ఉంది. 8 గంటల పాటు రెండు విడతలుగా ఈ రోడ్‌షో సాగనుంది.

తొలి విడత రోడ్‌షో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సాగుతుంది. రెండో విడత మధ్యాహ్నం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకూ జరుగుతుంది. తొలి విడత రోడ్‌షో బెంగళూరులోని సురంజన్ దాస్ రోడ్, మహదేవ్‌పుర, కేఆర్ పురం, శివాజీ నగర్, సీఆర్ రామన్ నగర్, శాంతి నగర్ మీదుగా సాగి బ్రిగేడ్ రోడ్డులోని వార్ మెమోరియల్‌కు చేరుకోవడంతో ముగుస్తుంది.

సిటీలోని రెండు అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలు తొలి ఫేజ్‌ రోడ్‌షోలో ఉండగా, ఇక్కడి ఐదు నియోజకవర్గాల్లో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, రెండో విడత రోడ్‌షో దక్షిణ బెంగళూరు మీదుగా సాగుతుంది.  పద్మనాభనగర్, విజయ్‌నగర్, బసవన్‌గుడి, గాంధీనగర్, మహాలక్ష్మి లేఅవుట్, గోవింద్‌రాజ్ నగర్, రాజాజీ నగర్, మల్లేశ్వరం మీదుగా రోడ్‌షా సాగుతుంది. బెంగళూరులోని 11 నియోజకవర్గాలను కలుపుతూ 6 గంటల సేపు 26.6 కిలోమీటర్ల మేర రోడ్‌షో సాగనుంది.

కాంగ్రెస్‌ వస్తే అశాంతి రాజ్యమేలుతుంది

కాగా, బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్నా కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అశాంతి రాజ్యమేలుతుందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.ఉగ్రవాదనేతలకు కాంగ్రెస్‌ ఆశ్రయం కల్పిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడి నుంచి పెట్టుబడిదారులు పారిపోతారని ధ్వజమెత్తారు.
 
ఎన్నికల ప్రచారం చేసిన ప్రతిచోట మోదీ బజరంగ్‌ బలి నినాదంతో ముందుకెళ్తున్నారు.  హోస్పేట్‌లో మాట్లాడిన ప్రధాని శ్రీరాముడితో కాంగ్రెస్ కు సమస్య రావడం దేశ దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఇప్పుడు జై బజరంగ్ బలి అంటున్న వారితో ఇబ్బంది వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
అంతకుముందు శ్రీరామ్ నినాదాలు చేసేవారిని లాక్కెళ్లేవారని, ఇప్పుడు జై బజరంగబలి అని నినాదాలు చేసేవారిని లాక్కెళ్లాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
ఇలా ఉండగా, బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ ఎన్నికల హామీని నిరసిస్తే గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బిజెపి నేతలు పిలుపునిచ్చారు. కర్ణాటకలో సాయంత్రం అన్ని ఆలయాల్లో హనుమాన్‌ చాలీసాను పఠించాలని బిజెపి నేతలు నిర్ణయించారు.