గోవాలో అడుగుపెట్టిన పాకిస్తాన్ మంత్రి భుట్టో

భారత దేశంలో జరిగే షాంఘై సహకార సంఘం సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం బయల్దేరారు. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. ఈ సమావేశాలు గురు, శుక్రవారాల్లో గోవాలో జరుగుతాయి. 2011 తర్వాత పాకిస్థాన్  ఒక అత్యున్నతస్థాయి అధికారి లేదా మంత్రి భారత్ కు రావడం ఇదే కావడం గమనార్హం.

ఎస్‌సీఓ  అధ్యక్ష స్థానంలో ప్రస్తుతం భారత దేశం ఉంది. దీంతో మన దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ పాక్ విదేశాంగ మంత్రిని ఆహ్వానించారు. పాకిస్థాన్ కోరిన మీదట భారత దేశ గగనతలంలో బిలావల్ విమానం ప్రయాణించేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పాక్ మీడియా తెలిపింది.

బిలావల్ భుట్టో జర్దారీ ఇచ్చిన ట్వీట్‌లో, తాను గోవా వెళ్తున్నానని తెలిపారు. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనాలనే తన నిర్ణయం ఎస్‌సీఓ చార్టర్‌కు పాకిస్థాన్ కట్టుబడి ఉండటాన్ని వెల్లడిస్తుందని తెలిపారు.

తన పర్యటనలో ప్రత్యేకంగా ఎస్‌సీఓపై దృష్టిసారిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో మిత్ర దేశాల విదేశాంగ మంత్రులతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అయితే, భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో బిలావల్ భుట్టో సమావేశం కాబోరని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

సుదీర్ఘ విరామం తరువాత ఈ కీలక భేటీకి భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇటీవలే ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీ ముగిసింది. ఇక విదేశాంగ మంత్రులు సమావేశం అయ్యారు. ఎస్సీఓలో పాకిస్తాన్‌కు సభ్యత్వం ఉన్నప్పటికీ ఆ దేశ మంత్రి రక్షణ శాఖ మంత్రి ఈ భేటీకి హాజరు కాలేదు. ఇస్లామాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఇందులో పాల్గొన్నారు.
 
దీనికి భిన్నంగా పాకిస్తాన్ తాజా నిర్ణయం తీసుకుంది. విదేశాంగ మంత్రుల భేటీకి ప్రతినిధులను పంపించింది. 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. భారత్ సహా చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియాల.. అబ్జర్వర్ స్టేట్స్‌ హోదాలో కొనసాగుతున్నాయి. ఇందులో ఆర్మేనియా, అజర్‌బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీలకు భాగస్వామ్య హోదా ఉంది.

 
ఈ భేటీలో పాల్గొనడానికి గల కారణాలను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వివరిస్తూ భారత్‌లో జరిగే ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటనలో చెప్పారు. ఎస్సీఓ సభ్య దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోన్నామని, అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు.
 
 ఎస్సీఓకు ఆతిథ్యాన్ని ఇస్తోన్న భారత్‌కు తమ ప్రతినిధులను పంపించడం ద్వారా తమ చిత్తశుద్ధి, నిబద్ధతను చాటుకున్నామని పాకిస్తాన్ ప్రధాని స్పష్టం చేశారు. ఆసియన్ రీజియన్‌లో శాంతి, సుస్థిరత పరిస్థితులను తాము కాంక్షిస్తోన్నామని వివరించారు. గోవా భేటీలో పాల్గొనడం ద్వారా భాగస్వామ్య ధర్మాన్ని తాము పాటించామని, ఆ విలువలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
 
వాటిని మరింత బలోపేతం చేసుకోవడంలో తమవంతు పాత్రను పోషించడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. సభ్య దేశాల మధ్య అన్ని రకాల కనెక్టివిటీ, వాణిజ్యం, పరస్పర సహకారం అవసరమని షెహబాజ్ షరీఫ్ తేల్చి చెప్పారు.