వాటర్ బోర్డు ఆఫీసు ముందు  బీజేపీ కార్పొరేటర్ల మెరుపు ధర్నా

సీవరేజీ పనులు చేయడం లేదంటూ వాటర్​బోర్డు ఖైరతాబాద్ హెడ్డాఫీస్​వద్ద బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు మంగళవారం మెరుపు ధర్నాకు దిగారు. ఆఫీస్ ​ముందు బైఠాయించిన కార్పొరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సిటీలో సీవరేజీ పనులు చేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని, ఎక్కడ చూసినా రోడ్లపై మురుగు పారుతోందని, మంచి నీరు కలుషితమై జనం ఆస్పత్రుల పాలవుతుంటే వాటర్​బోర్డ్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. డ్రైనేజీలను క్లీన్ చేసిన తర్వాత ఆ వ్యర్థాలను తొలగించకుండా రోడ్డుపై వదిలేస్తున్నారని మండిపడ్డారు.

రోడ్డుపై వదిలేసిన సిల్ట్​ (పూడిక మట్టి)ను సంచిల్లో తీసుకొచ్చి ఆఫీసు ముందు పోసి నిరసన తెలిపారు. డ్రైనేజీల్లో నుంచి సిల్ట్ తీసి నెలల తరబడి ఇండ్ల ముందు వదిలేస్తే ఆ కంపు భరించలేక జనం రోగాల బారిన పడుతున్న విషయం అధికారులకు తెలియాలనే ఇలా చేసినట్లు కార్పొరేటర్లు పేర్కొన్నారు.

కలాసిగూడలో ఇటీవల నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక మౌనిక మృతికి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  వాటర్​బోర్డ్ ఎండీ దానకిశోర్​ను కలిసేందుకు ఆఫీసులోకి వెళ్లే ప్రయత్నం చేసిన కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.

దీంతో కార్పొరేటర్లు, నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లి, గాంధీనగర్ పోలీస్​స్టేషన్లకు తరలించారు. మన్సురాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ వాటర్​బోర్డు ఏం చేస్తుందో అర్థం కావడం లేదని, డ్రైనేజీ, మంచినీటి సమస్యతో జనం విలవిల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకొని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. వర్షాలు పడుతున్న క్రమంలో జీహెచ్ఎంసీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో కార్పొరేటర్లు తోకల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, సరళ, మహాలక్ష్మి, రవిచారి తదితరులు పాల్గొన్నారు.