హైదరాబాద్‌లో ప్రముఖ వస్త్ర షోరూంలలో ఐటీ దాడులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 40 చోట్ల సోదాలు చేపట్టారు. నగరంలోని ప్రముఖ బట్టల షాపులో ఐటి అధికారులు దాడులు చేశారు.  కళామందిర్ షాప్ డైరెక్టర్ల ఇళ్లలోనే ఈ సోదాలన్నీ జరుగుతున్నట్లు సమాచారం.

 బుధవారం ఉదయం ఆరు గంటలకే డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్‌ ఇళ్లకి ఐటీ అధికారులు చేరుకున్నారు. అలాగే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కళామందిర్‌తో పాటు వరమహాలక్ష్మి, కాంచీపురం, కేఎల్‌ఎం ప్యాషన్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలోని 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు 40 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. వైజాగ్‌లోని ప్రముఖ వస్త్ర వ్యాపారులకు చెందిన ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు సంబంధించిన సమాచారం మేరకు ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, సినిమా రంగానికి చెందిన పలు నిర్మాణ సంస్థలలో దాడులు నిర్వహించిన ఐటి అధికారులు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని వస్త్ర దుకాణాలపై ఫోకస్ పెట్టారు.