రైతులు చస్తుంటే.. ఢిల్లీలో ఏం పని?

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు చస్తుంటే, వారిని ఆదుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలోని ఎల్లారెడ్డిపేటలో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయని పేర్కొన్నారు.

పిడికెడు వడ్లు మిగిలే పరిస్థితి లేదని చెబుతూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపుతున్నారని విమర్శించారు. కర్షకులను ఆదుకోవడానికి రూ.150 కోట్లు విడుదల చేస్తామని చెప్పినా  ఇంతవరకు దాని ఊసే లేదని ధ్వజమెత్తారు. 

ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదని నిలదీశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బంది కలుగుతోందన్న ఆయన కౌలు రైతులు ఏడుస్తున్నారని, వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈరోజు సిరిసిల్ల జిల్లాలో 1.7 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తే రైతులు సగానికిపైగా నష్టపోగా, అధికారులు మాత్రం 17 వేల ఎకరాల్లోనే పంట నష్టమైందని ఫీల్డ్ మీదకు పోకుండా లెక్కలు రాస్తున్నరని సంజయ్ మండిపడ్డారు. ఫీల్డ్ కు వెళితే ఒక లెక్క, వెళ్లకపోతే వాళ్లకు ఒక బాధ అంటూ  నిన్న ఒక ఆఫీసర్ ను సస్పెండ్ చేశారట… మరి ఫీల్డ్ కు వెళ్లని సీఎంను ఏం చేయాలి? అని ప్రశ్నించారు.

కేంద్రం జాతీయ విపత్తు నిధి కింద రాష్ట్రానికి రూ. 3వేల కోట్లు మంజూరు చేస్తే  అందులో రైతులకు ఎంత ఇచ్చావో చెప్పాలని, అసలు ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేశావో సమాధానం చెప్పాలని  సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు.

8 ఏళ్లలో ఒక్క రైతును ఆదుకోలేదని మండిపడ్డారు. కర్షకులు పడుతున్న కష్టాలను డైవర్ట్ చేయడానికి సచివాలయం ప్రారంభోత్సవం అని హాడావుడి చేస్తున్నారని  ఆరోపించారు.  ఫసల్ భీమా ఎందుకు అమలు చేయడం లేదని  బండి సంజయ్ ప్రశ్నించారు. సబ్సిడీ, ఫ్రీ యూరియా, రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మరిచారని ధ్వజమెత్తారు.

మార్చిలో అకాల వానలతో 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటే . కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటించి 2.8 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని చెప్పి ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున రూ. 288 కోట్లు విడుదల చేస్తున్నానన్నడని గుర్తు చేశారు. వారం రోజుల్లో పరిహారం ఇస్తానన్నడు గాని ఇంతవరకు పైసా ఇయ్యలేదని దుయ్యబట్టారు.